ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే ఐకూ 11. ఈ ఫోన్‌లో కెమెరా మరింత మెరుగ్గా పని చేయడం కోసం వీ2 చిప్‌ను అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ, వన్‌ప్లస్ 10టీ స్మార్ట్ ఫోన్లతో ఐకూ 11 పోటీ పడనుంది.


ఐకూ 11 ధర
ఐకూ 11 ప్రోలో నాలుగు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర 3,799 యువాన్లుగా (సుమారు రూ.44,100) నిర్ణయించారు. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర 4,099 యువాన్లుగానూ (సుమారు రూ.48,000), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,399 యువాన్లుగానూ (సుమారు రూ.52,000) ఉంది.


టాప్ ఎండ్ వేరియంట్ అయిన 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 4,999 యువాన్లుగా (సుమారు రూ.59,000) నిర్ణయించారు. ఐజిల్ ఆఫ్ మ్యాన్ స్పెషల్ ఎడిషన్, లెజెండరీ ఎడిషన్, ట్రాక్ వెర్షన్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఐకూ 11 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల ప్రారంభంలో లాంచ్ కానుంది.


ఐకూ 11 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 3 ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ 11 పని చేయనుంది. ఐకూ 11 ప్రో తరహాలోనే ఇందులో కూడా 6.78 అంగుళాల శాంసంగ్ ఈ6 అమోఎల్ఈడీ 2కే డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కాగా, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌పై ఐకూ 11 పని చేయనుంది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్ కూడా ఈ ఫోన్‌లో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 13 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందుబాటులో ఉంది.


512 జీబీ యూఎఫ్ఎస్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. 5జీ, వైఫై 6, ఎన్ఎఫ్‌సీ, బైదు, జీపీఎస్, గ్లోనాస్ , గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ ఓటీజీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. రివర్స్ వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీని మందం 0.84 సెంటీమీటర్లు కాగా, బరువు 208 గ్రాములుగా ఉంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?