యాపిల్ త్వరలో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నాయి. గత కొన్ని నెలల నుంచి ఈ ఫోన్లకు సంబంధించిన లీకులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆసియాలో సప్లై చైన్ సమస్యల కారణంగా ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ల ధరలు చాలా ఎక్కువగా ఉండనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించిన ధరల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


ఐఫోన్ 15 ధర (అంచనా)
లీకైన వివరాల ప్రకారం ఐఫోన్ 15 ధరలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ ఫోన్ స్టాండర్డ్ మోడల్ ధర 799 డాలర్లుగా ఉండవచ్చని తెలుస్తోంది. యాపిల్ సాధారణంగా ప్రో మోడల్స్ కాకుండా సాధారణ మోడల్స్‌ అమెరికాలో లాంచ్ అయిన ధరకు రెండు సున్నాలు యాడ్ చేసి మనదేశంలో విడుదల చేస్తుంది. దీన్ని బట్టి ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం కావచ్చు. ఐఫోన్ 13, ఐఫోన్ 14 కూడా మనదేశంలో ఇదే ధరతో లాంచ్ అయ్యాయి. కానీ తర్వాత కాలక్రమేణా కాస్త తగ్గాయి.


ఐఫోన్ 15 ప్లస్ ధర (అంచనా)
ఐఫోన్ 15 ప్లస్ ధరను కూడా యాపిల్ పెంచేలా కనిపించలేదు. ఈ ఫోన్ 899 డాలర్లతో అమెరికాలో లాంచ్ కానుందని అంచనా. అంటే మనదేశంలో రూ.89,900 ధరతో ఎంట్రీ ఇవ్వవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ కూడా ఇదే ధరతో మనదేశంలో లాంచ్ అయింది.


ఐఫోన్ 15 ప్రో ధర (అంచనా)
ఐఫోన్ 15 ప్రో ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ 14 ప్రో అమెరికాలో 999 డాలర్ల ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు 1,099 డాలర్ల ధరతో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్రో మనదేశంలో గతేడాది రూ.1,29,900 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు 100 డాలర్లు పెరిగింది కాబట్టి మనదేశంలో ఈ ఫోన్ ధర రూ.1,39,900 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఇది ప్రారంభ స్టోరేజ్ మోడల్ ధర. స్టోరేజ్ పెరిగే కొద్దీ ధర కూడా గట్టిగానే పెరుగుతుంది.


ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర (అంచనా)
గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 1,099 డాలర్ల ధరతో లాంచ్ అయింది. కానీ ఈసారి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ 1,299 డాలర్ల ధరతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. అంటే డాలర్లలో చూసుకుంటే 200 డాలర్ల మార్పు ఉండనుంది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ లాంచ్ అయినప్పుడు దాని ధర మనదేశంలో రూ.1,39,900గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర ఏకంగా రూ.20 వేల పెంపుతో రూ.1,59,900 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే టాప్ ఎండ్ 1 టీబీ వేరియంట్ ధర రూ.2 లక్షలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.


అయితే ఇవన్నీ అంచనా ధరలే. లాంచ్ అయ్యేనాటికి సప్లై చైన్‌లో ఏమైనా మెరుగుదల కనిపిస్తే తక్కువ ధరకే ఇవి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ తన కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. కానీ ఈసారి ఈ లాంచ్ అక్టోబర్‌కు వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్లకు చెక్ పెట్టాలంటే యాపిల్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.


Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial