ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ స్మార్ట్ ఫోన్ అక్టోబర్‌లో గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పుడు మనదేశంలో కూడా లాంచ్ కానుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇది 180W ఫాస్ట్ చార్జ్‌ను సపోర్ట్ చేయనుంది. 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో ఈ ఫోన్ రానుంది. ఇదే సెన్సార్‌తో లాంచ్ అయిన మోటో ఎక్స్40తో ఈ ఫోన్ పోటీ పడనుంది.


ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ ధర
ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో ఒక్క వేరియంట్‌తో లాంచ్ అయింది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 520 డాలర్లుగా (సుమారు రూ.42,400) నిర్ణయించారు. కాస్‌లైట్ సిల్వర్, జెనిసిస్ నాయిర్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో కూడా ఇదే రేంజ్2లో దీని ధర ఉండే అవకాశం ఉంది.


ఇన్‌ఫీనిక్స్ జీరో అల్ట్రా 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎక్స్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 6.8 అంగుళాల 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఈ ఫోన్ సెక్యూర్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.


ఈ ఫోన్ కేవలం 12 నిమిషాల్లోనే పూర్తిగా చార్జింగ్ ఎక్కనుంది. ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌లో రెండు చార్జింగ్ మోడ్స్ ఉన్నాయి. స్టాండర్డ్ మోడ్, ఫ్యూరియస్ మోడ్. వీటిలో ఫ్యూరియస్ మోడ్‌లో చార్జింగ్ పెడితే ఫాస్ట్ చార్జింగ్ ఎక్కుతుంది. జీపీఎస్, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 5జీ, వైఫై 6 వంటి ఫీచర్లు ఇందులో అందించారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 200 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?