గూగుల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి పిక్సెల్ ఫోల్డ్ అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా వస్తున్న అప్‌డేట్ ప్రకారం దీని ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీనికి ఫెలిక్స్ అని కోడ్‌నేమ్ పెట్టారు. ఇందులో రెండు డిస్‌ప్లేలు ఉండనున్నాయి. వీటిని శాంసంగ్ రూపొందించింది.


ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. సోనీ ఐఎంఎక్స్787 కెమెరాను ప్రధాన సెన్సార్‌గా అందించనున్నారు. దీంతోపాటు సోనీ ఐఎంఎక్స్386 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఎస్5కే3జేఐ టెలిఫొటో లెన్స్ కూడా ఉన్నాయి. లోపలి స్క్రీన్‌లో సోనీ ఐఎంఎక్స్355 సెన్సార్, అవుటర్ స్క్రీన్‌లో ఎస్5కే3జే1 టెలిఫొటో సెల్ఫీ కెమెరాలు ఉండనున్నాయి.


గత సంవత్సరం పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లతో పాటే పిక్సెల్ ఫోల్డ్ కూడా లాంచ్ కావాల్సి ఉంది. అయితే అది జరగలేదు. ఇప్పుడు వినిపిస్తున్న లీకుల ప్రకారం ఈ ఫోన్ 2023 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుంది. పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్లకు అవసరమైన ప్యానెల్ షిప్‌మెంట్లు 2023 జనవరి నుంచి ప్రారంభం అవుతాయని వార్తలు వస్తున్నాయి. చైనాలోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీలో వీటి తయారీ ప్రారంభం కానుంది. అయితే ఈ ఫోన్‌ను గూగుల్ అధికారికంగా ప్రకటించలేదు.


గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇటీవలే మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో పిక్సెల్ 7 ధర రూ.59,999 నుంచి, పిక్సెల్ 7 ప్రో ధర రూ.84,999 నుంచి ప్రారంభం కానుంది.


గూగుల్ పిక్సెల్ 7 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.32 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను గూగుల్ పిక్సెల్ 7లో అందించారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు గూగుల్ పిక్సెల్ 7లో అందించారు. ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌లు ఇందులో ఉన్నాయి. గూగుల్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు దీని బ్యాటరీ బ్యాకప్ రానుందని కంపెనీ ప్రకటించింది.


గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 7 ప్రో పని చేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. ఆక్టాకోర్ టెన్సార్ జీ2 ప్రాసెసర్‌ను గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో అందించారు. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 48 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు గూగుల్ పిక్సెల్ 7 తరహాలోనే 10.8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.


5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లను గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో అందించారు. ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌లు ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. గూగుల్ ఎక్స్‌ట్రీమ్ బ్యాటరీ సేవర్ మోడ్ ద్వారా 72 గంటల వరకు గూగుల్ పిక్సెల్ 7 ప్రోలో బ్యాటరీ బ్యాకప్ రానుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?