ఇటీవల ఫిలిప్పీన్స్, వియత్నాంలో కల్మెగి తుఫాను బీభత్సం సృష్టించడం తెలిసిందే. ఈ తుఫాను కారణంగా 100 మందికి పైగా మరణించగా, భారీగా ఆస్తి నష్టం సైతం సంభవించింది. కల్మెగి తుఫాను తర్వాత, ఒక ఐఫోన్ యూజర్ ఆశ్చర్యకరమైన సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. 3 రోజుల పాటు బురద, వరద నీటిలో తన ఐఫోన్ కూరుకుపోయిందని రెడిట్‌లో యూజర్ తెలిపాడు. ఆ తర్వాత అతను దాన్ని ఆన్ చేసినప్పుడు, ఎలాంటి సమస్య లేకుండా ఆన్ అయిందని, మంచి వర్క్ అవుతుందని చెప్పడం ట్రెండ్ అవుతోంది.
చేతి నుండి జారి నీటిలో పడిపోయిన ఫోన్
కల్మెగి తుఫాను కారణంగా చాలా విధ్వంసం జరిగిందని యూజర్ పేర్కొన్నాడు. తన ఇల్లు కూలిపోయిందని, ఇంట్లోని సామాగ్రి కొట్టుకుపోయిందని తెలిపాడు. తుఫాను వచ్చిన 15 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో తనకు అర్థమైందన్నాడు. ఈ సమయంలో ఐఫోన్ చేతి నుంచి జారి వరద నీటిలో పడిపోయింది. తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత, అతను తన వస్తువులను వెతకడం ప్రారంభించినప్పుడు, బురదలో ఐఫోన్ దొరికింది. వెంటనే ఫోన్‌ను శుభ్రం చేసి ఛార్జింగ్‌లో పెట్టాడు. ఛార్జింగ్ తరువాత అనుమానంగానే ఆన్ చేయగా ఐఫోన్ 17 ప్రో ఏ ప్రాబ్లం లేకుండా వర్క్ అయినట్లు తెలిపాడు. ఆన్ చేయడానికి ఛార్జింగ్ పెట్టానని, బురదలో మూడు రోజులు కూరుకుపోయినప్పటికీ బాగా పనిచేస్తుందని, దానిపై ఎటువంటి గీతలు పడలేదు. ఇతర సమస్యలు కూడా రాలేదని హర్షం వ్యక్తం చేశాడు.
ఐఫోన్ 17 ప్రో ఎంత మన్నికైనది?
Apple తీసుకొచ్చిన iPhone 17 Pro IP68 రేటింగ్ కలిగి ఉంది. అంటే ఇది వాటర్, డస్ట్, తేలికపాటి నీటి నిల్వను తట్టుకుని పనిచేస్తుంది. 30 నిమిషాల వరకు 6 మీటర్ల లోతు వరకు నీటిలో ఉంచినా సమస్య లేదని Apple చెబుతోంది. కానీ వాటర్ రెసిస్టెన్స్ శాశ్వతం కాదు. నిరంతరం ఉపయోగించిన తర్వాత కొంతకాలం తర్వాత దీని కెపాసిటీ తగ్గుతుంది. Apple లిక్విడ్ డ్యామేజ్‌ను వారంటీలో కవర్ చేయదని గుర్తుంచుకోండి. అంటే.. నీళ్లు లేదా ఇతర ద్రవాల వల్ల కలిగే డ్యామేజీని వారంటీలో కవర్ చేయరు.