Microsoft programming languages: మైక్రోసాఫ్ట్ తన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల నుండి C, C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను 2030 నాటికి పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో Rust అనే లాంగ్వేజ్‌ను తీసుకురావాలని పెట్టుకున్న లక్ష్యం ప్రస్తుతం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
దశాబ్దాలుగా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన విండోస్ , అజూర్ వంటి వాటిలో C , C++ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వీటిలో మెమరీ సేఫ్టీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ నివేదికల ప్రకారం, వారి సాఫ్ట్‌వేర్‌లలో వచ్చే సెక్యూరిటీ సమస్యలలో దాదాపు 70 శాతం కేవలం మెమరీ సంబంధిత లోపాల వల్లనే జరుగుతున్నాయి. రస్ట్ లాంగ్వేజ్ మెమరీని సురక్షితంగా నిర్వహించడంలో అత్యుత్తమమైనది కావడంతో, హ్యాకింగ్ ముప్పును తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కోట్లాది లైన్ల పాత కోడ్‌ను మార్చడం సాధారణంగా అసాధ్యం అనిపిస్తుంది. కానీ మైక్రోసాఫ్ట్ దీనికోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , ఆధునిక అల్గారిథమ్స్‌ను వాడుతోంది. వారి లక్ష్యం ఏమిటంటే ఒక ఇంజనీర్ - ఒక నెలలో - 10 లక్షల లైన్ల కోడ్ ను మార్చగలగాలి. దీనికోసం వారు ఒక శక్తివంతమైన 'కోడ్ ప్రాసెసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్'ను నిర్మించారు. ఇది పాత కోడ్‌ను అర్థం చేసుకుని, దాన్ని ఆటోమేటిక్‌గా రస్ట్‌లోకి మారుస్తుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఓ ఇంజనీర్ దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్త బయటకు వచ్చింది. అయితే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తాన్ని రాత్రికి రాత్రే మార్చేయడం లేదని .. కానీ ఇప్పటికే విండోస్ కెర్నల్ లోని కొన్ని భాగాలను రస్ట్‌లోకి మార్చడం ప్రారంభించారని మైక్రోసాఫ్ట్ వర్గాలు చెబుతున్నాయి.
2030 నాటికి ప్రతి లైన్ కోడ్‌ను మార్చడం అనేది చాలా పెద్ద లక్ష్యం. పాత సాఫ్ట్‌వేర్‌లు, హార్డ్‌వేర్ డ్రైవర్లు ఇప్పటికీ C/C++ పైనే ఆధారపడి ఉన్నాయి. AI సాయంతో కోడ్ మార్చినప్పటికీ, అది పక్కాగా పనిచేస్తుందో లేదో సరిచూడటం అత్యంత క్లిష్టమైన పని. కాబట్టి 100 శాతం మార్పు సాధ్యం కాకపోయినా, కీలకమైన సెక్యూరిటీ భాగాలు మాత్రం రస్ట్‌లోకి మారడం ఖాయంగా కనిపిస్తోంది.
మైక్రోసాఫ్ట్ యొక్క ఈ సాహసోపేతమైన అడుగు భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ భద్రతను పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇది విజయవంతమైతే, ఇతర టెక్ కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంటుంది.