మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్ సొంత మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన ఐమెసేజ్‌పై విరుచుకుపడ్డారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల్లోని ఒక పోస్ట్‌లో మార్క్ జుకర్‌బర్గ్ మెటా యాజమాన్యంలోని వాట్సాప్,  యాపిల్ యాజమాన్యంలోని iMessage కంటే “ప్రైవేట్, సురక్షితమైనది” అని పేర్కొన్నారు. మార్క్ జుకర్‌బర్గ్ యాపిల్‌కు వ్యతిరేకంగా ఎందుకు వెళ్తున్నారో గెస్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. గతంలో ఫేస్‌బుక్ అని పిలిచే మెటా ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అయిన WhatsApp, Facebook, Instagramలకు మాతృ సంస్థ.


మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేసింది ఇదే!
"నిజానికి iMessage కంటే WhatsApp చాలా ప్రైవేట్, సురక్షితమైనది, గ్రూప్ చాట్‌లతో సహా iPhone, Android రెండింటిలోనూ పని చేసే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వాట్సాప్‌లో ఉంది." అని మార్క్ జుకర్‌బర్గ్ పోస్ట్ చేసారు. వాట్సాప్ వినియోగదారులు ఒక్క క్లిక్ ద్వారా చాట్లు డిజప్పియర్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. 2021లో వాట్సాప్ మెసేజ్ బ్యాకప్‌లపై కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టిందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.


iMessage మీద సడెన్‌గా ఎందుకు?
ఇవన్నీ ఇప్పటికే చాలా మంది వినియోగదారులకు తెలిసినవే. మార్క్ జుకర్‌బర్గ్ దీనికి సంబంధించి కొత్తగా ఏమీ ప్రకటించలేదు. "కొంతమంది ఇప్పటికీ SMSని ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే ఇది ఫోన్‌లలో ముందే ఇన్‌స్టాల్ అయింది. అలాగే iMessage పని చేసే విధానం కారణంగా చాలా మంది SMSని ఉపయోగిస్తున్నారు" అని WhatsApp హెడ్ క్యాత్‌కార్ట్ ట్వీట్ చేశారు. జుకర్‌బర్గ్ కూడా హైలైట్ చేసిన WhatsApp యొక్క సురక్షిత ఎన్‌క్రిప్షన్ సేవ గురించి కూడా మాట్లాడారు.


అమెరికాలో WhatsApp ప్రజాదరణ పొందలేదా?
బిజినెస్ ఇన్‌సైడర్ అధ్యయనం ప్రకారం, WhatsApp అమెరికాలో 75.1 మిలియన్ల నెలవారీ వినియోగదారులను కలిగి ఉంది. భారతదేశం (390.1 మిలియన్లు) లేదా బ్రెజిల్ (108.4 మిలియన్లు)తో పోల్చినప్పుడు ఇది చాలా తక్కువ. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా నెలకు దాదాపు 2 బిలియన్ యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?