Lava Yuva 3 Launched: లావా యువ 3 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది మనదేశంలో లాంచ్ అయిన లావా యువ 2కి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆక్టా కోర్ యూనిసోక్ చిప్‌సెట్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ రన్ కానుంది. ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా ఇవ్వనున్నారు. రెండు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


లావా యువ 3 ధర (Lava Yuva 3 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందించారు. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.6,799గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299గా ఉంది. అమెజాన్‌లో దీనికి సంబంధించిన సేల్ ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. లావా ఈ-స్టోర్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.


లావా యువ 3 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని అదనంగా మరో 4 జీబీ వరకు పెంచుకోవచ్చు. 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంపై లావా యువ 3 రన్ కానుంది.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు ఏఐ సెన్సార్, వీజీఏ సెన్సార్ అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.


ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా లావా యువ 3 సపోర్ట్ చేయనుంది. 4జీ, వైఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. 3.5 ఎంఎం ఆడియో జాక్ ద్వారా హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. దీని మందం 0.84 సెంటీమీటర్లుగా ఉంది.


ఇటీవలే లావా బ్లేజ్ 2 5జీ కూడా మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది లాంచ్ అయిన లావా బ్లేజ్ 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మూడు కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 6.56 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌పై లావా బ్లేజ్ 2 5జీ పని చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది.


Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!


Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!