Jio vs Airtel: భారతీయ టెలికాం వినియోగదారులు క్రమంగా 5జీ నెట్‌వర్క్‌కు అలవాటు పడుతున్నారు. ఎందుకంటే జియో, ఎయిర్‌టెల్ గత కొన్ని నెలలుగా తమ వినియోగదారులకు ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీ సేవను అందజేస్తున్నాయి. ఒకవేళ 5జీ ఇంటర్నెట్‌కు మీరు అలవాటు పడితే భవిష్యత్తులో కచ్చితంగా 5జీ ప్లాన్‌ని కొనుగోలు చేయవలసి వస్తుంది.
భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభించి చాలా నెలలు అవుతుంది. ఎయిర్‌టెల్, జియో భారతదేశంలోని రెండు అగ్రగామి టెలికాం కంపెనీలు. ఇవి ఈ దేశంలో మొదట 5జీ సర్వీసును ప్రారంభించాయి. అయితే ఈ రెండు కంపెనీలు ఇంకా 5జీ ప్లాన్‌లను విడుదల చేయలేదు. యూజర్లు అందరికీ కూడా 5జీని ఉచితంగా అందిస్తున్నారు. దీంతో ఇప్పటికే చాలా మంది వినియోగదారులు ఉచిత 5జీ నెట్‌వర్క్‌ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
5జీ ఉచిత సర్వీసును నిలిపివేయనున్న జియో, ఎయిర్‌టెల్
జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు గత కొన్ని నెలలుగా తమ వినియోగదారులకు 5జీ సర్వీసు ప్రయోజనాలను చూపించడానికి, వాటిని అలవాటు చేయడానికి ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీ సౌకర్యాన్ని అందించాయి. ఈ రెండు కంపెనీలకు చెందిన వినియోగదారులకు 4జీ రీఛార్జిపై ఉచితంగా అన్‌లిమిటెడ్ 5జీ సర్వీసు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు దానికి శుభం కార్డు పడనుందట.
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం అన్‌లిమిటెడ్ 5జీ సర్వీసు త్వరలో ముగియబోతోంది. ఈ నివేదిక ప్రకారం జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు వేర్వేరుగా 5జీ కనెక్టివిటీ ప్లాన్‌లను అందించగలవు. 5జీ ప్లాన్‌ల ధర ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ ప్లాన్‌ల కంటే ఐదు నుంచి 10 శాతం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇది కేవలం ఒక సంవత్సరంలోనే 100 మిలియన్లకు పైగా అంటే 10 కోట్లకు పైగా వినియోగదారులకు చేరుకుంది. అయితే జియో, ఎయిర్‌టెల్ రెండూ తమ వినియోగదారుల నుంచి 5జీ సర్వీసు కోసం ఇంకా ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. ఈ రెండు కంపెనీలు వాటికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన 4జీ ప్లాన్‌లతో పాటు, వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 5జీ ప్లాన్ల సౌకర్యాన్ని ఉచితంగా అందించాయి. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.
5జీ ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలు ఎలా ఉంటాయి?
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం జియో, ఎయిర్‌టెల్ తమ 5జీ ప్లాన్‌లను 2024 ద్వితీయార్ధంలో అందుబాటులోకి తీసుకురావచ్చు. అంటే 2024 జులై నుంచి డిసెంబర్ మధ్య ఎప్పుడైనా ప్రారంభించవచ్చని టెలికాం పరిశ్రమలోని నిపుణుడు పేర్కొన్నారు.
5జీ ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు 10 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. 5జీ ప్లాన్‌లలో 4జీ ప్లాన్‌లతో పోలిస్తే 30% ఎక్కువ ఇంటర్నెట్ డేటా అందించనున్నారట. ప్రస్తుతం 4జీ ప్లాన్‌ల్లో రోజుకు 1.5 జీబీ నుంచి 3 జీబీ వరకు డేటా అందించే ప్లాన్లు ఉన్నాయి. అయితే 5జీ ప్లాన్‌ల్లో రోజుకు 2 జీబీ నుంచి 4 జీబీ వరకు డేటా ప్లాన్ ఇవ్వవచ్చు.
ఇది కాకుండా 2024లో 5జీ ప్లాన్‌లను ప్రారంభించడంతో పాటు కంపెనీలు 4జీ ప్లాన్‌ల రేట్లను కూడా పెంచబోతున్నాయని కూడా ఎకనామిక్ టైమ్స్ నివేదికలో తెలిపింది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!