iPhone 16 Design: యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ 2024 సెప్టెంబర్‌లో లాంచ్ కానుందని తెలిసిందే. ఈ సిరీస్‌లో మొత్తం ఎప్పటిలాగే నాలుగు ఫోన్లు ఉండనున్నాయట. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్లు ఈ సిరీస్‌లో ఉండే అవకాశం ఉంది. ఇందులో డిజైన్ పరంగా, ఫీచర్ల పరంగా చాలా మార్పులు చేయనున్నారని సమాచారం. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల్లో కనిపించే యాక్షన్ బటన్‌ను ఐఫోన్ 16 సిరీస్‌లో ఉండే అన్ని ఫోన్లలో అందిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని డమ్మీ యూనిట్స్‌కు సంబంధించి ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.


ప్రముఖ టిప్‌స్టర్ సోనీ డిక్సన్ ఎక్స్/ట్విట్టర్‌లో ఐఫోన్ 16 సిరీస్ డమ్మీ యూనిట్లకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. దీంతో ఐఫోన్ 16 సిరీస్‌లో ఉండే ఫోన్ల కూడా లీక్ అయింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ స్మార్ట్ ఫోన్లలో వెనకవైపు కెమెరా లేఅవుట్‌లో కూడా మార్పులు చేశారు.


ఈ రెండు ఫోన్లలోనూ వెనకవైపు కెమెరాలు నిలువుగా ఉండనున్నట్లు సమాచారం. ఐఫోన్ 13 నుంచి వెనకవైపు కెమెరాల డిజైన్‌లో యాపిల్ మార్పులు చేయలేదు. ఐఫోన్ 13, 14, 15 సిరీస్‌ల్లో వెనకవైపు కెమెరాలు డయాగోనల్‌గా ఉండేవి. ఇప్పుడు వాటిని పిల్ ఆకారంలో నిలువుగా ఉండే సెటప్‌కు మార్చనున్నారు. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ల్లో మాత్రం కెమెరా సెటప్‌లో ఎక్కువ మార్పులు కనిపించలేదు.






లీకైన ఫొటోల ప్రకారం ఈసారి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అన్ని ఫోన్లలోనూ యాక్షన్ బటన్ ఉండనుంది. ఈ యాక్షన్ బటన్‌ను మొట్టమొదటి సారి ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ల్లో అందించారు. అంతకు ముందు వచ్చిన ఐఫోన్‌ల్లో ఉండే మ్యూట్ స్విచ్‌ను ఇందులో రీప్లేస్ చేశారు. దీని ద్వారా టాస్క్‌లు, షార్ట్‌కట్‌లను లాంచ్ చేయవచ్చు.


Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది


ఐఫోన్ 16 సిరీస్‌లో ప్రత్యేకంగా క్యాప్చర్ బటన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా యూజర్లు ఫొటోలను వేగంగా తీయవచ్చు. గతంలో వచ్చిన లీకుల ప్రకారం ఈ కొత్త క్యాప్చర్ బటన్ ఫోన్‌కు కుడివైపు ఉండనుంది. డమ్మీ యూనిట్లలో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది.


ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు లాంచ్ అవ్వడానికి ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఉంది. సాంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ రెండో వారంలో ఈ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. దీంతోపాటు ఐవోఎస్ 18 కూడా అందుబాటులోకి రానుంది. ఐవోఎస్ 18కు సంబంధించిన ఫీచర్లను జూన్ 10వ తేదీన జరగనున్న డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024లో యాపిల్ ప్రకటించే అవకాశం ఉంది. వీటి గురించి త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. గతంలో ఐఫోన్ 16 సిరీస్‌లో ఐదు ఫోన్లు ఉంటాయని వార్తలు వచ్చాయి. కానీ ఈ డమ్మీ యూనిట్ల డిజైన్‌తో ఇది నిజం కాదని అనుకోవచ్చు.


Read Also: మామా నీ ‘టైమ్’ ఎంత? చంద్రుడికి టైమ్ జోన్ సెట్ చేస్తున్న నాసా, వైట్ హౌస్ కీలక ఆదేశాలు