ఐఫోన్ 14 సిరీస్ కొన్ని నెలల్లో లాంచ్ కానుండగా.. ఇప్పుడే ఐఫోన్ 15 ప్రోకు సంబంధించిన లీకులు కూడా ప్రారంభం అయ్యాయి. యాపిల్ ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ప్రోటో టైప్స్‌ను టెస్ట్ చేయడం ప్రారంభించింది. ఇందులో 5x టెలిఫొటో లెన్స్ అందించనున్నారని తెలుస్తోంది.
ఐఫోన్ 15 ప్రో గురించిన సమాచారాన్ని ప్రముఖ అనలిస్ట్ జెఫ్ పూ వెల్లడించారు. 9టు5మ్యాక్‌లో దీనికి సంబంధించిన కథనాలు కూడా వచ్చాయి. అయితే యాపిల్ ఇంతవరకు ఐఫోన్ 14 సిరీస్‌నే అధికారికంగా ప్రకటించలేదు. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 13 సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్లు రానున్నాయి.
ఒకసారి ఈ కాంపోనెంట్స్‌ను అప్రూవ్ చేస్తే.. వచ్చే సంవత్సరం రానున్న యాపిల్ హైఎండ్ ఫోన్లలో వీటిని అందించనున్నారు. 2022 మేలో యాపిల్ వీటిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాంటే ఆప్టిక్స్ వీటిని రూపొందించే అవకాశం ఉంది. కేవలం యాపిల్ కోసమే 100 మిలియన్ యూనిట్ల సెన్సార్లు ఈ కంపెనీ రూపొందించనుందని తెలుస్తోంది.
అయితే పెరిస్కోప్ లెన్స్ అనేవి కొత్త టెక్నాలజీ కాదు. ఇప్పటికే ఎన్నో ఆండ్రాయిడ్ ఫోన్లలో చూస్తున్నదే. పెద్ద టెలిఫొటో కెమెరాలతో పాటు చిన్న మోడర్న్ స్లిమ్ ఫోన్లలో కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ టెక్నాలజీ ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నప్పటికీ.. యాపిల్‌లో అందుబాటులోకి రావడం మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది.