ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లాంచ్ కానున్న ఐఫోన్ 14 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ వరకు ర్యామ్ అందించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 13 ప్రోకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ ఈ మధ్యే లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో ఇదే ర్యామ్‌ను అందించారు.


కొన్ని మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఇప్పటికే ఈ ర్యామ్‌ను అందించారు. ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 13 ప్రోల్లో 6 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉంది. అయితే యాపిల్ ఈ 8 జీబీ ర్యామ్ న్యూస్‌ను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


కొరియాకు చెందిన ఒక టిప్‌స్టర్ దీనికి సంబంధించిన వివరాలను లీక్ చేశారు. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో 8 జీబీ ర్యామ్ ఉండనుందని తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నారు. 2020లో లాంచ్ అయిన ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్, 2021లో లాంచ్ అయిన ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్‌ల్లో 6 జీబీ వరకు ర్యామ్ ఉంది.


ఐఫోన్ 14 ప్రోకు సంబంధించిన మాస్ ప్రొడక్షన్‌ను కూడా కంపెనీ ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కరోనావైరస్ పాండమిక్ కారణంగా దీనికి అవసరమైన కొన్ని ఉత్పత్తులు దొరకడం కష్టం అవుతుంది. దీంతో ముందే దీన్ని ప్రారంభించారు. బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం... సప్లై చెయిన్ సమస్యల కారణంగా యాపిల్ ఐఫోన్ 13 ప్రొడక్షన్ గోల్‌ను కోటి యూనిట్ల వరకు తగ్గించింది.


11 అంగుళాల ఐప్యాడ్ ప్రో (2021)లో యాపిల్ ఇప్పటికే 16 జీబీ ర్యామ్‌ను అందించింది. ఇది 2021 ఏప్రిల్‌లో లాంచ్ అయింది. ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్‌లతో ఐఫోన్ 14 ప్రో సిరీస్ పోటీ పడనుంది. 


శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాలో మాత్రం 12 జీబీ ర్యామ్ వేరియంట్ అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్22 ప్లస్‌ల్లో 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. యాపిల్ ఇప్పటివరకు ఐఫోన్ 14 సిరీస్ గురించి ఎటువంటి అధికారిక ప్రకటనా చేయలేదు.