ఒకప్పుడు థియేటర్లలో కొత్త సినిమా రిలీజైతే గంటల తరబడి క్యూలో నిలబడి టికెట్లు కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆన్ లైన్ టికెటింగ్ యాప్స్ వచ్చిన తరువాత అందరూ అందులోనే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు. అయితే కన్వీనియెన్స్ ఫీజు అనేది ఉంటుంది. దీనికోసం టికెట్ రేటు కంటే అదనంగా కొంత డబ్బుని చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆన్ లైన్ టికెటింగ్ కోసం ఎన్ని యాప్స్ ఉన్నా.. బుక్ మై షో మాత్రం బాగా క్లిక్ అయింది.
దాదాపు అందరి ఫోన్లలో బుక్ మై షో యాప్ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లానాయక్' సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో ఆ సినిమా బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా..? అని బుక్ మై షో యాప్ వంక చూస్తూనే ఉన్నారు జనాలు. కానీ ఇప్పుడు నిర్మాతల ఆలోచన మారినట్లు తెలుస్తోంది. నైజాంలో ఈ సినిమాను దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్.. ఇతర డిస్ట్రిబ్యూటర్లతో కలిసి బుక్ మై షోను బహిష్కరించాలని నిర్ణయించినట్లు టాక్.
'భీమ్లానాయక్' సినిమాను నైజాంలో ఇప్పటికే ఒక థియేటర్ కు బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేసి.. ఆ తరువాత తీసేశారు. ప్రస్తుతానికి బుక్ మై షోలో 'భీమ్లానాయక్' సినిమా అందుబాటులో లేదు. ఈ విషయం గురించి సునీల్ నారంగ్ మీడియాతో మాట్లాడారు. బుక్ మై షోను తామే ప్రమోట్ చేసి పాపులర్ అవ్వడానికి కారణమయ్యామని.. ఇప్పుడు అది దయ్యంలాగా మారిందని షాకింగ్ కామెంట్స్ చేశారు.
కన్వీనియెన్స్ ఫీ పేరుతో టికెట్ మీద 20 నుంచి 40 రూపాయల వరకు వసూలు చేస్తుండడం.. ప్రేక్షకులకు భారంగా మారిందని అన్నారు. ఆ కారణంగానే చాలా మంది థియేటర్లకు రావడం లేదని చెప్పారు. కన్వీనియెన్స్ ఫీ తగ్గించాలని డిస్ట్రిబ్యూటర్లు కోరినప్పటికీ.. బుక్ మై షో వాళ్లు అంగీకరించకపోవడంతో 'భీమ్లానాయక్' లాంటి పెద్ద సినిమాను బుక్ మై షోకి ఇవ్వకుండా థియేటర్ల దగ్గరే టికెట్స్ అమ్మాలని భావిస్తున్నారట. అయితే ఇంత పెద్ద సినిమాకి థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మితే.. బ్లాక్ టికెట్స్ దందా పెరిగే ఛాన్స్ ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.