8 గంటల పాటు ఇన్స్టాగ్రామ్ సేవలకు అంతరాయం


 మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు గడిచిన కొద్ది రోజులు ప్రపంచ వ్యాప్తంగా డౌన్ అవుతున్నాయి. ఇప్పటికే వాట్సాప్ డౌన్ కాగా కంపెనీ ఎట్టకేలకు సేవలను పునరుద్దరించింది. తాజాగా  మరో సోషల్ మీడియా అప్లికేషన్ ఇన్‌స్టాగ్రామ్ దాదాపు ఎనిమిది గంటలపాటు ఆగిపోయింది.  ప్లాట్‌ఫామ్‌ను యాక్సెస్ చేయకుండా వినియోగదారులను నిరోధించే సాఫ్ట్‌వేర్ బగ్‌ను ఫిక్స్ చేసినట్లు కంపెనీ తాజాగా వెల్లడించింది. "మేము ఇప్పుడు ఈ బగ్‌ని పరిష్కరించాము. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వ్యక్తులకు సంబంధించిన అకౌంట్లను యాక్సెస్ చేయడంలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది. కొంతమంది ఫాలోవర్స్ సంఖ్యలో తాత్కాలిక మార్పుకు కారణమైంది. క్షమించండి" అని Meta Platforms Inc యాజమాన్యంలోని Instagram  ట్వీట్ చేసింది.





 అకౌంట్ల యాక్సెస్ కు మెయిల్ ఐడిలు, ఫోన్ నెంబ్లరు  


అటు సస్పెండ్ చేయబడిన తమ అకౌంట్ల యాక్సెస్ చేయడానికి ఇమెయిల్ ఐడిలు, ఫోన్ నంబర్‌లను అడిగారని పలువురు వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము. అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నాము" అని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చిన వెంటనే  Instagram కమ్యూనికేషన్స్ ట్వీట్ చేసింది. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్‌లో 7,500 మంది ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఆ తర్వాత ఫిర్యాదుల సంఖ్య  దాదాపు 500కి తగ్గిందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. డౌన్‌డెటెక్టర్ దాని ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారు ఎత్తిచూపిన  లోపాలతో సహా అనేక నివేదికలను రికార్డు చేస్తుంది. ఈ అంతరాయం చాలా పెద్ద సంఖ్యలో వినియోగదారులను ప్రభావితం చేయవచ్చని డౌన్‌డెటెక్టర్ వెల్లడించింది.


ఈ నెల 25న వాట్సాప్ సేవలకు అంతరాయం


ఇప్పటికే మెసేజ్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ కూడా రెండు గంటలకు పైగా భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అంతరాయాన్ని ఎదుర్కొన్నది. కొద్ది రోజుల్లోనే మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ సమస్య ఏర్పడింది.  అక్టోబర్ 25న  వాట్సాప్ సుమారు రెండు గంటల పాటు పనిచేయలేదు. ఎలాంటి మేసేజ్ లు, ఫోటోలు, వీడియోలనును షేర్ చేసే అవకాశం కోల్పోయారు వినియోగదారులు. ఆ తర్వాత కంపెనీ వెంటనే సమస్యను పరిష్కరించింది.   ఈ నేపథ్యంలో అంతరాయానికి గల కారణాలను  వివరిస్తూ సవివరంగా నివేదిక సమర్పించాల్సిందిగా ఐటీ మంత్రిత్వ శాఖ మెటాను ఆదేశించింది.   వాట్సాప్ అంతరాయంపై మెటా నివేదిక ఇప్పటికే ఐటీ మంత్రిత్వ శాఖకు సమర్పించినట్లు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ తాజాగా  పీటీఐ పేర్కొంది. అయితే, నివేదికలోని విషయాలు మాత్రం బయటకు  తెలియరాలేదు.


పడిపోయిన మెటా షేర్ల వ్యాల్యూ


ఇన్ స్టాలో తలెత్తిన కారణాల మమూలంగా ఆ కంపెనీ షేర్లు దారుణంగా దెబ్బతతిన్నాయి. స్టాక్ మార్కెట్లలో విస్తృత అమ్మకాల మధ్య మెటా షేర్లు 6.1 శాతం పడిపోయాయి. పెద్ద మొత్తంలో కంపెనీ నష్టాలను ఎదుర్కొన్నది.