Indonesia Bans Google Pixel: ఇటీవల ఐఫోన్ 16ను బ్యాన్ చేసిన తర్వాత ఇండోనేషియా ఇప్పుడు గూగుల్ పిక్సెల్ ఫోన్ల అమ్మకాన్ని నిషేధించింది. దేశీయ కంటెంట్ అవసరాలను తీర్చలేనందుకు ఇండోనేషియా గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాన్ని నిషేధించింది. ఇండోనేషియా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా సమాచారం కూడా ఇచ్చింది.


ఇండోనేషియాలో విక్రయించే స్మార్ట్‌ఫోన్‌ల్లో 40 శాతం స్థానిక కంటెంట్ అందించే వరకు గూగుల్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించలేమని ఇండోనేషియా పరిశ్రమ మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపిన దాని ప్రకారం ఇండోనేషియా దేశీయ తయారీని ప్రోత్సహించడం, ఇంపోర్టెడ్ టెక్నాలజీపై ఆధారపడటాన్ని తగ్గించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నిషేధం తర్వాత ఇండోనేషియాలో పిక్సెల్ ఫోన్‌లను అధికారికంగా విక్రయించబోరు. 


పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫాబ్రి హెండ్రీ ఆంటోనీ అరీఫ్ గూగుల్ ఉత్పత్తులు తమ సెట్ ప్లాన్‌ను అనుసరించడం లేదని తెలిపారు. యూజర్లు విదేశాల నుంచి గూగుల్ పిక్సెల్‌ని కొనుగోలు చేసి ఇండోనేషియాలో వాడుకోవచ్చని తెలిపారు. ఇందుకోసం వారు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు ఇండోనేషియాలో అక్రమంగా విక్రయించే ఫోన్లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.



Also Read: షాకిస్తున్న పైరసీ ఇన్‌కమ్ - నిర్మాతల కంటే ఎక్కువ డబ్బులు వీరికే - ఏటా ఎన్ని వేల కోట్లు?


ఐఫోన్ 16 విక్రయాలను నిలిపివేయాలని ఆదేశాలు
ఇటీవల ఇండోనేషియా ఐఫోన్ 16 విక్రయాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ నిర్ణయం యాపిల్ మీద తీసుకున్న కఠినమైన చర్యలో భాగం. తమ దేశంలో పెట్టుబడులు పెట్టే విషయమై యాపిల్ మాట్లాడిందని ఇండోనేషియా ప్రభుత్వం ఆరోపించింది. కానీ కంపెనీ అలా చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.


యాపిల్ ఇండోనేషియాలో కొంత డబ్బును పెట్టుబడి పెట్టింది, కానీ అది కంపెనీ ముందుగా తెలిపినంతగా లేదు. అందువల్ల ప్రభుత్వం నుంచి టీకేడీఎన్ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. దీని కారణంగా యాపిల్ ఐఫోన్ 16 ఇండోనేషియాలో అందుబాటులో ఉండదు. ఇండోనేషియా ప్రభుత్వం మిగిలిన పెట్టుబడి కోసం ఎదురుచూస్తోంది. నివేదికల ప్రకారం యాపిల్ ఇండోనేషియాలో రూ. 1.48 ట్రిలియన్లను పెట్టుబడి పెట్టింది. యాపిల్ మొత్తంగా రూ. 1.71 ట్రిలియన్ల పెట్టుబడి పెడతామని తెలిపింది. ఈ పరిస్థితిలో సంస్థ ప్రభుత్వ అంచనాలను అందుకోలేదు.



Also Read: మోస్ట్ అవైటెడ్ వన్‌ప్లస్ 13 లాంచ్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయి?