మనదేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ 2025 నాటికి రెట్టింపు కానుందని ఓ అధ్యయనంలో తేలింది. మొబైల్ డివైసెస్ ఇండస్ట్రీలకు సంబంధించిన సంస్థ ఐసీఈఏ, రీసెర్చ్ సంస్థ ఐడీసీ తమ పరిశోధనలో తెలిపాయి. 2025 నాటికి మనదేశంలో సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 4.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.34,500 కోట్లు) చేరుతుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు.


ప్రస్తుతానికి ఈ మార్కెట్ మనదేశంలో 2.3 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.17,250 కోట్లు) ఉందని తెలుస్తోంది. ఒక్క డివైస్ విలువ సగటున రూ.6,900గా ఉందని కూడా ఈ నివేదికలో పేర్కొన్నారు. ‘రీ-మాన్యుఫ్యాక్చరింగ్, రీ-కామర్స్‌కు ఇండియా త్వరలో గ్లోబల్ హబ్‌గా మారనుంది. దేశంలో ఎక్కువమంది ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు రీ-కామర్స్ ద్వారానే మారనున్నారు.’ అని తెలిపారు.


ఈ మార్కెట్ పెరుగుదల కూడా చాలా ఎక్కువగా ఉందని.. దీని కారణంగా ఈ-వేస్ట్ తగ్గుతుందని ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) చైర్మన్ పంకజ్ మొహింద్రూ ఈ నివేదికను ఆవిష్కరిస్తున్న సమయంలో తెలిపారు.


ప్రస్తుతానికి మనదేశంలో 95 శాతం సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్లను యాజ్ ఇటీజ్‌గా విక్రయిస్తున్నారు. కేవలం ఐదు శాతానికి మాత్రమే రిపేర్లు లేదా రీఫర్బిషింగ్ అవసరం అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మార్కెట్లో 90 శాతం వరకు స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్‌లు, గేమింగ్ కన్సోల్స్, కెమెరాలు కేవలం 10 శాతంమే. అయితే వీటి విక్రయాలు కూడా మెల్లగా పెరుగుతున్నాయని తెలుస్తోంది.


మనదేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేవారిలో 78 శాతం మంది రూ.30 వేల లోపు ఫోన్లు కొనుగోలు చేస్తున్నారని ఈ నివేదికలో తెలిపారు. 18 శాతం మంది రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉన్న ఫోన్లు కొంటున్నారని తెలుస్తోంది. అంటే ఇక్కడ కూడా మిడ్ రేంజ్ ఫోన్ల డామినేషనే నడుస్తోందన్న మాట.