IT Rules 2021 Amendments:భారత్‌లోని డిజిటల్ రంగంలో భావప్రకటనా స్వేచ్ఛ, నియంత్రణలపై మరోసారి చర్చ మొదలైంది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, ఐటీ రూల్స్ 2021ను మార్చాలని కేంద్రం చూస్తోంది. ఇందులో చేపట్టబోయే మార్పులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్ కంటెంట్‌పై కేంద్రం మరింత పట్టు సాధించే దిశగా చర్యలు తీసుకుంటుందనే ప్రచారం సాగుతోంది.
ఇప్పటి వరకు ప్రభుత్వ గుర్తించిన మీడియా, పబ్లిషర్స్‌ను మాత్రమే నియంత్రించగలిగేది. ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, ఇతర స్వతంత్ర కంటెంట్ క్రియేటర్లు పెట్టే కంటెంట్‌ను నియంత్రించడం కానీ, ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకురావచ్చు. అంటే నేరుగా అవన్నీ కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి.
ముఖ్యంగా పార్ట్III(రూల్8) మార్పుల ప్రకారం, అధికారికంగా వార్తా సంస్థలుగా గుర్తించిన వ్యక్తులు చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు లేదా పబ్లిక్ అఫైర్స్ కంటెంట్‌ను హోస్ట్ చేసే ప్లాట్‌ఫామ్‌లపై పర్యవేక్షణ పెరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్‌ను చదివిన తర్వాత మీరు దానిపై స్పందిస్తే కచ్చితంగా ఆ విషయం ప్రభుత్వ నియంత్రలోకి వస్తుంది. అంటే దానిపై ప్రభుత్వం రూల్స్‌కు లోబడి ఉందా లేదా అనేది పరిశీలించవచ్చు.
కొత్తగా రూపొందించిన రూల్స్‌పై ప్రభుత్వం అభిప్రాయసేకరణ చేస్తోంది. వీటిపై మీకు ఉన్న అభిప్రాయాన్ని ఏప్రిల్ 14వ తేదీ లోపు చెప్పాల్సి ఉంటుంది. అప్పటి వరకు వివిధ వర్గాల నుంచి వచ్చిన స్పందనలను క్రోడీకరించి బిల్లులో మార్పులు చేర్పులు చేయనున్నారు.
ఐటీ చట్టం సెక్షన్ 79, సేఫ్ హార్బర్ రూల్స్
ప్రతిపాదిత మార్పుల ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు, సలహాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 కింద సేఫ్ హార్బర్ ప్రయోజనాలను పొందాలంటే ప్లాట్‌ఫామ్‌లు ఈ మార్గదర్శకాలను పాటించడం తప్పనిసరి అని రూల్ 3(4) స్పష్టం చేస్తోంది.
దీనిపై ఐఎఫ్‌ఎఫ్ వంటి సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం ఎక్కువ అవుతుందని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చే అన్ని రూల్స్ బహిర్గతం కాకపోవచ్చని, దీని వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని అంటున్నారు. ఇది రాజ్యాంగ సూత్రాలు విరుద్ధమని వాదిస్తున్నారు.
ముప్పు పొంచి ఉందంటున్న ప్రభుత్వం
మారుతున్న టెక్నాలజీని అందరూ సక్రమంగా వాడుకోవడం లేదని ప్రభుత్వం వాదిస్తోంది. ఐటీ చట్టంలో తీసుకొచ్చే మార్పులపై స్పందించిన మంత్రి అశ్విని వైష్ణవ్ డీప్‌ఫేక్, ఏఐ కంటెంట్‌ను చూపిస్తున్నారు. వీటి ద్వారా సృష్టించే నకిలీ కంటెంట్ వల్ల భారీ ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ఇలాంటి కంటెంట్‌కు బ్రేక్ వేయడానికే చట్టానికి పదును పెడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇలాంటి చర్యలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తీసుకుంటున్నాయని వివరించారు.
