Google Pay : ప్రస్తుతం చాలా మంది డబ్బులను జేబులో పెట్టుకోవడమే మరచి పోయారు. ఎక్కడికి వెళ్లిన స్మార్ట్ ఫోన్ సహాయంతో డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. వీధి వ్యాపారుల నుంచి బడా మాల్స్ వరకు డిజిటల్ పేమెంట్స్ అంగీకరిస్తున్నాయి. దీంతో డిజిటల్ పేమెంట్స్ పరిమితి పెరిగిపోతుంది. అంతే కాకుండా ప్రస్తుతం అనేక యూపీఐ పేమెంట్స్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటివి ప్రస్తుతం మార్కెట్ లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇండియాలో అత్యంత పాపులర్ అయిన యూపీఏ పేమెంట్స్ ప్లాట్‌ఫాం గూగుల్ పే. తాజాగా కొన్ని కీలక మార్పులను ప్రకటించింది. ఇకపై విద్యుత్, గ్యాస్, ఫోన్ రీచార్జ్‌లను గూగుల్ పే ద్వారా చెల్లించేటప్పుడు వినియోగదారులకు కన్వీనియెన్స్ ఫీజు ఛార్జ్ వసూలు చేయనున్నట్లు తెలిపింది. అయితే, వ్యక్తిగత UPI ట్రాన్సాక్షన్లు, రిటైల్ అవుట్‌లెట్స్ వద్ద యూపీఐ ద్వారా జరగుతున్న చెల్లింపులు ఉచితంగా ఉంటాయని గూగుల్ పే స్పష్టం చేసింది.


కన్వీనియెన్స్ ఫీజు వివరాలు
కొత్త మార్పుల ప్రకారం.. గూగుల్ పే ద్వారా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేసే వినియోగదారులకు కన్వీనియెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజు సాధారణంగా చెల్లింపుల మొత్తం నుండి 1 శాతం వరకు ఉండవచ్చు. ఉదాహరణగా, మీ విద్యుత్ బిల్ రూ.1,500 అయితే, అదనంగా రూ.15 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ పే కొత్త ఫీజుల  విధానం ఇతర UPI ఆధారిత పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ లలో ఇప్పటికే అమలు అవుతుంది.  Paytm, PhonePe వంటి ప్లాట్‌ఫామ్లలో ఇప్పటికే బ్యాంక్ కార్డుల ద్వారా చెల్లింపులకు ఇలాంటి ఫీజులు అమలులో ఉన్నాయి.


కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోన్న గూగుల్ పే
గూగుల్ పే తదుపరి కొన్ని నెలలలో UPI సర్కిల్ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు, పెద్దల కోసం UPI లావాదేవీలు సులభంగా చేయవచ్చు. పెద్దలు గూగుల్ పే అకౌంట్ లేకుండా కూడా, ప్రధాన యూజర్ UPI అకౌంట్‌ను లింక్ చేసి, చెల్లింపులను నిర్వహించవచ్చు. ఈ విధానం ద్వారా ప్రధాన యూజర్ తమ కుటుంబ పెద్దల ట్రాన్సాక్షన్‌లను శాసించగలుగుతారు.


పెరగనున్న ట్రాన్సాక్షన్ లిమిట్
ఇండియాలో UPI పేమెంట్స్ ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ పే వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కల్పించడానికి మరికొన్ని మార్పులు తీసుకురానుంది. వాటిలో, UPI Lite బ్యాలెన్స్‌ను ఆటో రీప్లెనిష్ చేసే ఆప్షన్ ను, అలాగే ట్రాన్సాక్షన్ లిమిట్‌ను రూ.2,000 నుండి రూ.5,000 వరకు పెంచే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కల్పించడానికి ఉంటాయి.


వాట్సాప్ యూపీఐ కొత్త ఫీచర్
  WhatsApp UPI ద్వారా కూడా బిల్లు చెల్లింపులు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు. దీనివల్ల వినియోగదారులకు మరిన్ని ఆఫ్షన్లు లభిస్తాయి, అలాగే WhatsApp ఫీచర్ వస్తే UPI ద్వారా బిల్లు చెల్లింపులు మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.


 గూగుల్ పే భారతదేశంలో UPI ఆధారిత డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేసే నిర్ణయం కొంతమంది వినియోగదారులకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అయినప్పటికీ, గూగుల్ పే ఇచ్చే కొత్త ఫీచర్లు, సౌకర్యాలు  వినియోగదారులను మరింత ఆకర్షించే అవకాశం ఉంది. UPI లావాదేవీల ప్రాచుర్యం పెరుగుతూ, మరిన్ని ఆఫ్షన్లు వినియోగదారులకు అందుబాటులో ఉండడం వల్ల, డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ మరింత అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.