గూగుల్ క్రోమ్ తన లోగోను 8 సంవత్సరాల తర్వాత మార్చింది. గూగుల్ క్రోమ్‌ను డిజైన్ చేసిన ఎల్విన్ హు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ కొత్త లోగోను విడుదల చేశారు. అయితే ఈ లోగోకు గూగుల్ పెద్దగా మార్పులు చేయలేదు. లోగోలోని షాడోలు తీసేసి, మరింత సింప్లిఫై చేసింది.


ఇందులో రంగులు మరింత బ్రైట్‌గా ఉన్నాయి. మధ్యలో ఉన్న పెద్ద బ్లూ బాల్ సైజ్‌ను కొంచెం పెంచారు. విండోస్, మ్యాక్ఓఎస్, ఐవోఎస్ హోం పేజీలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఇందులో వేర్వేరు వేరియేషన్లు రూపొందించినట్లు గూగుల్ తెలిపింది.


గత ఎనిమిది సంవత్సరాల్లో మొదటి సారి లోగోను మార్చామని, త్వరలో మారిన లోగో మీ డివైస్‌ల్లో కనిపిస్తుందని ఎల్విన్ హు ట్విట్టర్‌లో తెలిపారు. ఆపరేటింగ్ సిస్టం కోసం ప్రత్యేకమైన కస్టమైజేషన్లు చేశామని, ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో తమ లోగోలు కొత్తగా కనిపిస్తాయని హు పేర్కొన్నారు.


గూగుల్ త్వరలో లాంచ్ చేయనున్న క్రోమ్ 100 అప్‌డేట్‌తో కొత్త గూగుల్ క్రోమ్ లోగో లైవ్ కానుంది. హు తెలుపుతున్న దాని ప్రకారం.. ఎవరైనా క్రోమ్ క్యానరీ వెర్షన్ వాడుతుంటే.. వారికి ఇప్పటికే ఈ కొత్త వెర్షన్ కనిపిస్తుంది. ఇక సాధారణ వినియోగదారులకు త్వరలో ఈ లోగో కనిపించనుంది.