గూగుల్ కొత్త చవకైన క్రోమ్‌కాస్ట్ విత్ గూగుల్ టీవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ మూడో తరం క్రోమ్‌కాస్ట్ స్థానంలో ఇది లాంచ్ కానుంది. 2018లో గూగుల్ చివరిసారి క్రోమ్‌కాస్ట్‌ను లాంచ్ చేసింది. త్వరలో రానున్న క్రోమ్‌కాస్ట్‌లో 1080పీ వరకు రిజల్యూషన్ ఉండనుంది. గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ కూడా ఇందులో ఉండనుంది. రెగ్యులర్ క్రోమ్‌కాస్ట్ కంటే ఇది తక్కువ ధరతో లాంచ్ కానుంది.


ఇతర క్రోమ్‌కాస్ట్ మోడల్స్ లాగానే ఇది కూడా క్యాస్టింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఏవీఐ హార్డ్‌కోర్ డీకోడింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. దీన్ని క్రోమ్‌కాస్ట్ హెచ్‌డీ విత్ గూగుల్ టీవీ అని పేరు పెడతారని వార్తలు వస్తున్నాయి.


దీనికి బోరియల్ అనే కోడ్ నేమ్ ఇచ్చారు. యామ్‌లాజిక్ S805X2 సీపీయూ, మాలి-జీ31 జీపీయూ, 2 జీబీ ర్యామ్ ఉండనున్నాయి. ఇందులో అందించే హార్డ్‌వేర్ ఏవీఐ నేటివ్ డీకోడింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు 60 ఎఫ్‌పీఎస్ ఫ్రేమ్ రేట్ ఫీచర్ కూడా ఉండనుంది.


2018లోనే గూగుల్ 1080పీ రిజల్యూషన్‌తో క్రోమ్‌కాస్ట్ 3ని లాంచ్ చేసింది. అందులో నేటివ్ యాప్ సపోర్ట్ లేదా రిమోట్ కంట్రోల్స్ సపోర్ట్ లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గూగుల్ క్రోమ్ కాస్ట్ ధర 50 డాలర్లుగా (సుమారు రూ.3,700) ఉంది. త్వరలో లాంచ్ కానున్న క్రోమ్‌కాస్ట్ ధర దీని కంటే తక్కువగా ఉండనుందని తెలుస్తోంది. అంటే రూ.3,000లోపు ధరతోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.


రోకు, అమెజాన్ కాస్టింగ్ డివైస్‌లతో ఇది పోటీ పడనుందని తెలుస్తోంది. అయితే గూగుల్ దీని గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రోమ్‌కాస్ట్ మేలో జరగనున్న గూగుల్ ఐ/ఓ సదస్సులో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మనదేశంలో కూడా ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.