జియో ఫైబర్ యూజర్లకు ఇది శుభవార్తే. ఇకపై ఎలాంటి కెమెరా, వెబ్‌క్యామ్ అవసరం లేకుండానే టీవీ నుంచి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ‘కెమెరా ఆన్ మొబైల్’ పేరుతో తీసుకొచ్చిన ఫీచర్ ద్వారా ఈ వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది.
సాంకేతికత రోజురోజుకీ పెరుగుతోంది. ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పెరుగుతున్నాయి. వాటిని వినియోగిస్తున్నవారి సంఖ్యా రెట్టింపవుతోంది. దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు కూడా పోటాపోటీగా అప్‌డేట్ వెర్షన్లు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. గతంలో ఏడాదికో, రెండేళ్లలో మార్పులు చేర్పులు చేసే కంపెనీలు… ఇప్పుడు రోజుల వ్యవధిలో అప్ డేట్ అయిపోతున్నాయ్. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఫీచర్లు డిజైన్ చేసి…. యూజర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు. కెమెరా ఆన్ మొబైల్ పేరుతో తాజాగా జియో ఫైబర్ యూజర్స్ కి మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
వెబ్ కెమెరా అవసరం లేకుండా యూజర్స్ తన మొబైల్ ఫోన్ సాయంతో టీవీలో వీడియోకాల్స్ మాట్లాడుకునేలా కెమెరా ఆన్ మొబైల్ పేరుతో కొత్త ఫీచర్ ను పరిచయం చేశారు. ఈ ఫీచర్ ‘జియో జాయిన్’ యాప్ (గతంలో జియో కాల్) ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు అందుబాటులో ఉంది. వీడియో కాల్స్ కోసం ఫోన్ కెమెరాను ఇది ఇన్‌పుట్ డివైజ్‌గా మార్చేస్తుంది. అప్పుడు టీవీ ద్వారా ఎంచక్కా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, జియో ఫైబర్ యూజర్లు తమ మొబైల్‌లోని జాయిన్ జియో యాప్ ద్వారా తమ ల్యాండ్‌లైన్ నంబరు నుంచి వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు.
మొబైల్‌ను ఉపయోగించి టీవీ ద్వారా వీడియో కాల్స్ చేసుకునేందుకు ముందు పది అంకెల జియో ఫైబర్ నంబరును జాయిన్ జియో యాప్‌లో జోడించాల్సి ఉంటుంది. దీనిద్వారా మీ మొబైల్ వర్చువల్‌గా టీవీకి కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత జియో జాయిన్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘కెమెరా ఆన్ మొబైల్’ పీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అంతే.. ఫోన్‌ను వెబ్‌కెమెరాగా ఉపయోగించి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వీడియో కాల్స్ స్పష్టంగా ఉండాలంటే తమ మోడెమ్స్‌ను 5GHz వై-ఫై బ్యాండ్‌గా మార్చుకోవాలని జియో ఫైబర్ చెబుతోంది. 2.4GHz బ్యాండ్‌లో వీడియో కాల్స్ చేసుకోవచ్చు కానీ… వీడియో క్వాలిటీ అంత స్పష్టంగా ఉండదని పేర్కొంది.
ఇటీవలి కాలంలో, OnePlus, Xiaomi తో సహా పలు కంపెనీలు టీవీల కోసం ప్రత్యేకంగా వెబ్‌క్యామ్‌లను తీసుకొచ్చాయి. కరోనా కారణంగా అంతా ఆన్ లైన్ అయిన ఈ రోజుల్లో... ఫోన్‌లను వెబ్‌క్యామ్‌లుగా ఉపయోగించే మోడల్ జియో ఫైబర్ వినియోగదారులకు అదనపు సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎందుకంటే వారు తమ టీవీల ద్వారా వీడియో కాల్స్ చేయడానికి ప్రత్యేక పరికరాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.