మ్యాథ్యూ షార్ట్, కూపర్ కోనోలీ బలమైన ఇన్నింగ్స్‌ల కారణంగా, అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా భారత్‌ను 2 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కూడా కైవశం చేసుకుంది.  మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా కాంగారూలు 22 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి మ్యాచ్ గెలిచారు. 17 సంవత్సరాల తర్వాత అడిలైడ్‌లో భారత జట్టు వన్డే మ్యాచ్‌లో ఓడిపోయింది. 

Continues below advertisement

IND vs AUS: శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వన్డేలలో ప్రారంభం బాగా లేదు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌ను గిల్ కోల్పోయాడు. భారత బౌలర్లు 264 పరుగులు కాపాడుకోవడంలో విఫలమయ్యారు. రోహిత్ శర్మ (73 పరుగులు) శ్రేయాస్ అయ్యర్ (61 పరుగులు) అర్ధ సెంచరీలు వృథా పోయాయి.  

265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ప్రారంభంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కెప్టెన్ మిచెల్ మార్ష్ 11 పరుగులు, ట్రావిస్ హెడ్ 28 పరుగులు చేసి అవుట్ అయ్యారు. అనుభవం లేని మిడిల్ ఆర్డర్‌ను చూస్తుంటే, భారత బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లను లక్ష్యాన్ని చేరుకోనివ్వరని అనిపించింది, కానీ మూడో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన మాట్ షార్ట్ మొదట మాట్ రెన్‌షా (30 బంతుల్లో 30 పరుగులు)తో కలిసి మూడో వికెట్‌కు 155 పరుగులు జోడించి తన జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు. 

Continues below advertisement

అయితే, మధ్యలో మళ్ళీ భారత్‌వైపు తిరిగినట్టే కనిపించింది. రెన్‌షా అవుటైన తర్వాత, అలెక్స్ కారీ కూడా కేవలం 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 132 పరుగుల వద్ద కాంగారూలు 4 వికెట్లు కోల్పోయారు.  అప్పుడు మ్యాచ్‌పై టీమిండియా పట్టుబిగిస్తుందనిపించింది. కానీ కూపర్ కోనోలీ భారత జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. షార్ట్ వన్డే క్రికెట్‌లో తన మూడో అర్ధ సెంచరీని సాధించాడు. అతను 78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74 పరుగులు చేసి అవుటయ్యాడు.

షార్ట్ అవుటైన తర్వాత, భారత్ మళ్ళీ ఆశలు పెట్టుకుంది, కానీ మిచెల్ ఓవెన్ ఎదురుదాడి చేశాడు. ఓవెన్ కేవలం 23 బంతుల్లో 36 పరుగులు చేశాడు, అతని బ్యాట్ నుంచి 2 ఫోర్లు, 3 సిక్సర్లు వచ్చాయి. అదే సమయంలో, కూపర్ కోనోలీ 53 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని బ్యాట్ నుంచి 5 ఫోర్లు, ఒక సిక్స్ వచ్చాయి. అతను ఆస్ట్రేలియాను గెలిపించి నాటౌట్‌గా తిరిగి వచ్చాడు.