టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు టెక్నాలజీ మీద ఆసక్తి ఉన్నవారిలో, ముఖ్యంగా యువతలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో తనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. తన ట్వీట్లకు రీట్వీట్లు, లైకులు కూడా కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి.


అయితే ఒక ఫాలోయర్ మాత్రం ఏకంగా ఎలాన్ మస్క్‌నే భయపెట్టాడు. కేవలం 19 ఏళ్ల వయసు మాత్రమే ఉన్న ఒక టీనేజర్ ఎలాన్ మస్క్ ప్రయాణించే ప్రైవేట్ జెట్లను ట్రాక్ చేస్తున్నాడని తెలుస్తోంది. తన జెట్లను ట్రాక్ చేయకుండా ఉండటానికి ఎలాన్ మస్క్ తనకు ఐదు వేల డాలర్లు (మనదేశ కరెన్సీలో రూ.3.75 లక్షలు) ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


ఎలాన్ మస్క్ ఈ హ్యాకర్‌ను ట్విట్టర్‌లో కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఇతను ఎలాన్ మస్క్ జెట్ (@ElonJet) అనే ట్విట్టర్ పేజీని కూడా రన్ చేస్తున్నాడు. తనను 19 సంవత్సరాల వయస్సు ఉన్న జాక్ స్వేనీ అనే యువకుడే ఈ హ్యాకర్ అని తెలుస్తోంది.


తన జెట్స్ గురించి ట్వీట్ చేయకుండా ఉండటానికి జాక్‌కు మస్క్ ఐదు వేల డాలర్లు ఆఫర్ చేశారు. అయితే జాక్ ఈ ఆఫర్‌ను వద్దన్నాడు. తనకు 50 వేల డాలర్లు (సుమారు రూ.37.55 లక్షలు) కావాలని అతను కోరాడు. తన స్కూల్ ఫీజు కట్టుకోవడానికి, ఒక టెస్లా కారు కొనుక్కోవడానికి ఆ మొత్తం సరిపోతాయన్నాడు.


న్యూస్ వెబ్ సైట్ ప్రొటోకాల్ కథనం ప్రకారం.. జాక్ స్వేనీ మొత్తం 15 ఫ్లైట్ ట్రాకింగ్ ఖాతాలు క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఖాతాను బోట్స్ ద్వారా రన్ చేస్తున్నాడు. విమానాలు టేకాఫ్ అయి ల్యాండ్ అయ్యేదాకా వాటిని ట్రాక్ చేసేలా ఈ బోట్స్‌ను రూపొందించాడు.


కేవలం ఎలాన్ మస్క్ మాత్రమే కాకుండా బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి హై ప్రొఫైల్ క్లయింట్ల ప్రైవేట్ జెట్లను కూడా ఇతను ట్రాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎలాన్ జెట్ ఖాతా ద్వారా మాత్రం కేవలం ఎలాన్ మస్క్ విమానాలను మాత్రమే ఇతను ట్రాక్ చేస్తున్నాడు. ఈ కుర్రోడు తనను తాను ఎలాన్ మస్క్‌కు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటున్నాడు.