Elon Musk May Resign: ప్రపంచ కుబేరుడు, గ్లోబల్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్ (Twitter), ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla) సహా గ్లోబల్ జెయింట్ కంపెనీలకు CEO అయిన ఎలాన్ మస్క్, ప్రపంచానికి మరో షాక్ ఇచ్చారు. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పదవికి ఆయన రాజీనామా చేస్తారట!. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్వీట్ చేశారు.
ట్విట్టర్ CEO పదవికి తాను రాజీనామా చేయాలా, వద్దా (YES or NO) అంటూ ఎలాన్ మస్క్ ఆదివారం ఓ పోల్ పెట్టారు. ఎక్కువ మంది ఏం కోరుకుంటే తాను అదే చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈ పోల్‌లో పాల్గొన్న ట్విట్టర్ వినియోగదారుల్లో మెజారిటీ సభ్యులు YES (ట్విట్టర్ CEO పదవికి మస్క్ రాజీనామా చేయాలి) ఆప్షన్‌ను ఓటు వేశారు. ట్విట్టర్ నుంచి మస్క్ వెళ్లిపోవాలని మొత్తం 57.5 శాతం మంది వినియోగదారులు కోరుకున్నారు.
మెజారిటీ ప్రజాభిప్రాయం ప్రకారం, ట్విట్టర్ CEO పదవికి తాను రాజీనామా చేస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించి, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. పోల్ పాల్గొన్న ట్విట్టర్ వినియోగదారులకు కూడా ఇది ఆశ్చర్యకరమైన విషయమే. ఎందుకంటే, టెస్లా భవిష్యత్తును పణంగా పెట్టి ట్విట్టర్‌ను కొని, నడుపుతున్న మస్క్.. ఆ సంస్థ అధిపతి పదవి నుంచి దిగిపోతారని ఎవరూ అనుకోలేదు. మస్క్ పెట్టిన పోల్‌లో పాల్గొన్నారు తప్పితే, దానిని సీరియస్‌గా తీసుకోలేదు.
ట్వీట్ ద్వారా ఎలాన్ మస్క్ ఏం చెప్పారు?
ప్రజల అభిప్రాయాన్ని అనుసరించాలని తాను నిర్ణయించుకున్నట్లు, పదవికి రాజీనామా చేస్తానని, సరైన మూర్ఖుడు దొరికిన వెంటనే ట్విట్టర్ CEO పదవిని అతనికి కట్టబెట్టి తాను రాజీనామా చేస్తానని తన ట్వీట్‌లో మస్క్ పేర్కొన్నారు. ఆ తర్వాత తాను సాఫ్ట్‌వేర్, సర్వర్ టీమ్స్‌ను మాత్రమే చూసుకుంటానని వెల్లడించారు.
కొత్త CEO కోసం మస్క్ వెతుకులాట
CNBC నివేదిక ప్రకారం... ట్విట్టర్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోసం ఎలోన్ మస్క్ చురుకుగా వెతుకుతున్నారు. YES or NO అంటూ ఒక పోల్ పెట్టి కొరివితో తల గోక్కున్న మస్క్‌కు, ట్విట్టర్ CEO పదవి నుంచి దిగిపోవడం బాధాకరమైన అంశమే. ఈ ఏడాది (2022) అక్టోబర్‌లో ట్విట్టర్ CEOగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. 2 నెలల్లోనే ఆ సీటు నుంచి దిగిపోవాలని ప్రజలు కోరుకోవడం, రాజీనామా చేయాల్సిన పరిస్థితి రావడం ఎలాన్ మస్క్‌కి నిరాశ కలిగించే విషయమే. ఎందుకంటే అతను ట్విట్టర్‌గా బాధ్యతలు చేపట్టి కేవలం 2 నెలలు మాత్రమే. అయితే... ఇచ్చిన మాట మీద మస్క్ నిలబడతారా అన్నది అనుమానమే. గతంలో ఆయన చాలాసార్లు మాట తప్పిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ మాట మీద నిలబడారు అనుకున్నా... మస్క్‌కు సూటయ్యే మూర్ఖుడు ఎప్పటికి దొరకాలి? CEO పదవికి ఎప్పుడు రాజీనామా చేయాలి?.