Gemini Student Offer: విద్యార్థులకు గూగుల్ అదిరిపోయే ఆఫర్- జెమినీ 2.5 ప్రో, 2 టీబీ స్టోరేజ్ ఉచితం- ఎవరు అర్హులు? ఎలా అప్లై చేయాలి?
Gemini AI 2.5 Pro Free: భారతీయ విద్యార్థులకు గూగుల్ భారీ ఆఫర్ ఇచ్చింది. జెమినీ 2.5 ప్రో, 2 టీబీ స్టోరేజ్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది.
Gemini AI 2.5 Pro Free: భారతీయ విద్యార్థుల కోసం ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలకమైన ఆఫర్ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) రంగంలోని అత్యంత శక్తివంతమైన జెమినీ 2.5 ప్రో మోడల్‌ను విద్యార్థులకు ఏడాదిపాటు ఉచితంగా అందిస్తోంది. ఎడ్యుకేషనల్ టూల్స్‌ను మరింత సులభతరంగా వాడుకునే వీలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్‌లో భాగంగా 2 టెరాబైట్‌ల ఫొటోలు, డాక్యుమెంట్‌లు, మీడియా ఫైల్‌లను నిల్వ చేసే వీలు కల్పించింది.
జెమినీ 2.5 ప్రో ఆఫర్ దరఖాస్తు గడువు ఎప్పటి వరకు?
Just In
గూగుల్ అందిస్తున్న ఈ ఆఫర్ ఈ నెల మొదటి వారం నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులు సెప్టెంబర్ 15 వరకు తీసుకుంటారు. వాస్తవంగా జెమినీ 2.5 ప్రో కొనుక్కోవాలంటే ఏడాదికి రూ.19,500 ఖర్చు పెట్టాలి. 2 టీబీ కొనాలన్నా సరే భారీగా ఖర్చు అవుతుంది. ఇంత ఖరీదైన టూల్స్‌ను ఇప్పుడు విద్యార్థులకు ఉచితంగా గూగుల్ అందిస్తోంది.
జెమినీ 2.5 ప్రో ఎలా ఉపయోగించుకోవచ్చు?
ఈ టూల్స్‌ను విద్యార్థులకు హోమ్‌వర్క్ చేయడానికి, పరిశోధనలు చేయడానికి, ఎస్సేలు రాయడానికి, ఉద్యోగాల ఇంటర్వ్యూల కోసం ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడతాయి. భారత్ AI ఆధారిత విద్యను ప్రోత్సహించేందుకు ఒక కీలకమైన ముందడుగుగా టెక్ నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను మెరుగుపరచే అవకాశాన్ని కల్పిస్తుందని అంటున్నారు.
జెమినీ 2.5 ప్రో ఉచితంగా పొందాలంటే రూల్స్ ఏంటీ?
ఈ ఉచిత జెమినీ 2.5 ప్రో సేవలు పొందేందుకు గూగుల్ కఠినమైన రూల్స్ ఫ్రేమ్ చేసింది. విద్యార్థి 18 ఏళ్లు లేదా అందుకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. విద్యార్థి భారతీయ పౌరుడై ఉండాలి. కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో చదువుతున్న వ్యక్తి అయి ఉండాలి. చెల్లుబాటు అయ్యే కళాశాల ఈ-మెయిల్ ఐడీ, విద్యాసంస్థ ఇచ్చిన ఐడీ గూగుల్‌కు సబ్‌మిట్ చేయాలి. విద్యార్థి వ్యక్తిగత గూగుల్ అకౌంట్, గూగుల్ పేమెంట్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ ఆఫర్‌లో ఎటువంటి డబ్బులువసూలు చేయకపోయినా ధ్రువీకరణ కోసం ఖాతా వివరాలు మాత్రం ఇవ్వాలి.
ఇప్పటికే గూగుల్ వన్ సభ్యత్వం కలిగిన విద్యార్థులు ఈ ఆఫర్‌కు అనర్హులు. ఈ ఆఫర్‌ను కేవలం కొత్త విద్యార్థులకు, ఇంకా సభ్యత్వం పొందని వారికి పరిమితం చేస్తుంది. పట్టణ, గ్రామీణ విద్యార్థులు ఎవరైనా పొందవచ్చు.
ఆఫర్ ఎలా పొందాలి?
ఈ ఉచిత జెమినీ 2.5 ప్రో సేవలు పొందడానికి విద్యార్థులు ఈ స్టెప్స్‌ను అనుసరించాలి. గూగుల్‌లోని అధికారిక ఆఫర్ పేజీ ఓపెన్ చేయాలి. అర్హత వివరాలు చెక్ చేయండి. ఆ తర్వాత, చదువునే కాలేజీ, యూనివర్శిటీ ఈ-మెయిల్ ఐడీని ఉపయోగించి విద్యార్థి స్టాటస్ చెప్పాలి. దీనికి ఒక ఫారం ఫిల్ చేయాలి. ఆ కాలేజీ నిర్దారించిన తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ధృవీకరణ పూర్తైన తర్వాత, విద్యార్థి వ్యక్తిగత గూగుల్ అకౌంట్, గూగుల్ పేమెంట్స్ అకౌంట్‌ను లింక్ చేయాలి. ఈ దశలో క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు సబ్‌మిట్ చేయాలి. ఈ వివరాలు ఇచ్చినంత మాత్రాన ఎలాంటి డబ్బులు వసూలు చేయబోరు. ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, విద్యార్థి 15 సెప్టెంబర్ 2025 వరకు దరఖాస్తును ఖరారు చేసుకోవాలి. తర్వాత మళ్లీ పూర్తి వివరాలతో కాలేజీ లేదా యూనివర్శిటీ ధ్రువీకరణ కోసం మెయిల్ చేస్తారు. కాలేజీ అథారిటీ మరోసారి ఓకే చెప్పాలి. అప్పటి నుంచి ఏడాది పాటు జెమినీ 2.5 ప్రో వాడుకోవచ్చు.
జెమినీ 2.5 ప్రోతో పాటు ఇచ్చే టూల్స్ ఏంటీ?
జెమినీ 2.5 ప్రో విద్యార్థులకు అనేక ఆధునిక టూల్స్ అందిస్తోంది. ఇవి వారి విద్యా ప్రయాణంలో ఒక మార్పును తీసుకురావచ్చు. మొదట, జెమినీ 2.5 ప్రో AI మోడల్, ఇది ఇతర AI సాధనాల కంటే ఎక్కువ డేటా ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది విద్యార్థులకు పరిశోధన, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సహాయం చేస్తుంది. హోమ్‌వర్క్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కోడింగ్ ప్రాజెక్ట్‌లలో సహాయకకారిగా ఉంటుంది. ఇలా వివిధ మార్గాలాల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
జెమినీ 2.5 ప్రోతోపాటు నోట్‌బుక్‌ఎల్ఎం అనే టూల్ విద్యార్థులకు అందిస్తోంది. ఇది ఐదు రెట్లు ఉపయోగ అవకాశాలను కల్పిస్తోంది. చదువుతున్న సమాచారాన్ని ఆడియో రూపంలో మార్చి, ఎక్కడైనా వినే ఛాన్స్ ఇచ్చింది. జెమినీ లైవ్ అనేది రియల్‌టైమ్ డిస్కషన్స్‌తో ఆలోచనలను పంచుకోవడం, ఇంటర్వ్యూల కోసం సిద్ధం కావచ్చు. వియో 3 టూల్ విద్యార్థులకు సృజనాత్మక ప్రాజెక్ట్‌లు తయారు చేసే అవకాశం కల్పిస్తుంది.
అదనంగా, ఈ ఆఫర్‌లో 2 టెరాబైట్‌ల గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ అందిస్తుంది. ఇది విద్యార్థుల ప్రాజెక్ట్‌లు, పరిశోధన డాటా, వ్యక్తిగత ఫైల్‌లను సురక్షితంగా నిల్వ చేసేందుకు సహాయపడుతుంది. ఈ స్టోరేజ్ సౌకర్యం విద్యార్థులకు వారి డిజిటల్ పనులను నిర్వహించడంలో మద్దతుగా నిలుస్తుంది. గూగుల్ ఈ ప్రత్యేక ఆఫర్, విద్యార్థులకు AIని వారి విద్యా, కెరీర్ అవకాశాల కోసం ఉపయోగించేందుకు ఒక కొత్త మార్గాన్ని చూపుతోంది.