TruthGPT: ఐదేళ్ల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అణ్వాయుధాల కంటే ప్రమాదకరమైనది అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన ట్విట్టర్‌, టెస్లా సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా ఇప్పుడు ఏఐపై దృష్టి సారించారు. ప్ర‌స్తుతం చాట్ జీపీటీకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వస్తున్న ఆదరణతో మస్క్ కూడా ఏఐ బాటపట్టారు. ఏఐ చాట్ బోట్‍ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.                                               


"నేను 'ట్రూత్ జీపీటీ' అని పిలిచే లేదా విశ్వవ్యాప్త‌మైన ప్రాకృతిక‌ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే గరిష్ట సత్యాన్వేషణ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(AI) త్వ‌ర‌లోనే ప్రారంభిస్తాను" అని మస్క్ సోమవారం ప్రసార‌మైన‌ ఫాక్స్ న్యూస్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు. 


ట్రూత్ జీపీటీ అత్యుత్త‌మ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో పాటు మాన‌వ వ‌న‌రుల‌కు ఎలాంటి హాని త‌ల‌పెట్ట‌ని విధంగా ఉంటుంద‌ని మ‌స్క్ వెల్ల‌డించారు. "ఇది ప్రారంభించ‌డం కాస్త ఆల‌స్యం కావ‌చ్చు. కానీ, మూడ‌వ ఎంపిక కోసం నేను త‌ప్ప‌కుండా ప్ర‌య‌త్నిస్తాను" అని తెలిపారు.






కాగా.. మైక్రోసాఫ్ట్ స‌హ‌కారంతో ప్ర‌స్తుతం సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ (AI) చాట్ జీపీటీ (ChatGPT)పై ఎలాన్ మ‌స్క్ అనేక విమ‌ర్శ‌లు చేశారు. అబ‌ద్దాలు చెప్పేందుకు ఏఐ శిక్ష‌ణ ఇస్తున్నార‌ని, ఓపెన్ సోర్సుగా ప్రారంభ‌మైన ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ క్లోజ్ సోర్సుగా మారుతోంద‌ని.. మైక్రోసాఫ్ట్‌తో స‌న్నిహితంగా మెలుగుతూ లాభాల కోసం పాకులాడుతోంద‌ని ఆరోపించారు. గూగుల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు లారీ పేజ్ కూడా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ భ‌ద్ర‌త‌పై నిర‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌ని మ‌స్క్ ఆరోపించారు. 


కాగా.. నాన్ ప్రాఫిట్ స్టార్టప్‍గా ఓపెన్ ఏఐ సంస్థను 2015లో సామ్ ఆల్టమన్ స్థాపించినప్పుడు ఎలాన్ మస్క్ దానిలో పెట్టుబడులు పెట్టారు. 2018లో ఆ కంపెనీ నుంచి వైదొలిగారు. ఆ ఓపెన్ ఏఐ సంస్థనే ఇప్పుడు చాట్‍ జీపీటీని సృష్టించింది. ప్రస్తుతం ఆ ఓపెన్ ఏఐలో మైక్రోసాఫ్ట్ ప్రధాన పెట్టుబడిదారుగా ఉంది.


చాట్‍జీపీటీ కొంతకాలంలోనే కోట్లాది మంది యూజర్లను సంపాదించుకుంది. ఏ ప్రశ్నకైనా వివరంగా టెక్స్ట్ రూపంలో సమాధానాలు చెబుతుండడంతో ఈ ఏఐ చాట్ బోట్ ప్లాట్‍ఫామ్‍ విశేషంగా ఆద‌ర‌ణ పొందుతోంది. వ్యాసాలు, కంప్యూటర్ కోడింగ్, సాహిత్యం, మ్యాథమ్యాటిక్స్ ఇలా ఏ విషయంపై ప్ర‌శ్నకైనా చాట్ జీపీటీ టెక్స్ట్ రూపంలో వివ‌రంగా స‌మాధానాలు ఇస్తోంది. 


మరోవైపు గూగుల్ కూడా బార్డ్ పేరుతో ఏఐ చాట్‍బోట్‍ను తీసుకొస్తోంది. దీన్ని ప్రపంచానికి కూడా పరిచయం చేసింది. ప్రస్తుతం గూగుల్ బార్డ్ టెస్టింగ్ ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే అందుబాటులోకి తీసుకొస్తామని గూగుల్ చెబుతోంది. భవిష్యత్తు మొత్తం ఏఐ ఆధారంగానే ఉంటుందనే అంచనాల నేపథ్యంలో వాట్సాప్‌, మెసెంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ టూల్స్ వినియోగాన్ని ఆమోదించాల‌ని మెటా సీఈవో మార్క్‌ జుకెర్‌బర్గ్‌ నిర్ణయించారు. ఇందుకోసం మెటాలో ఏఐ టూల్స్‌ అభివృద్ధి కోసం నిపుణులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. స్నాప్‌చాట్‌ కూడా ఒక ఏఐ టూల్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తోంది.