ChatGPT Lifts Restrictions On Ghibli Style Images: ఇప్పుడు, టెక్ ప్రపంచమంతా జిబ్లీ జపం చేస్తోంది. ఓపెన్‌ఏఐ (OpenAI)లో ఫన్నీగా కనిపించే 'జిబ్లీ స్టైల్' ఇమేజెస్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది & ప్రపంచవ్యాప్తంగా యూజర్ల ఆదరణ సునామీలా వచ్చి పడుతోంది. ఆ రెస్పాన్స్‌కు ఉబ్బితబ్బిబ్బయిన కంపెనీ, తాజాగా, ఫ్రీ యూజర్లకు 'జిబ్లీ ఫిల్టర్' వాడకంపై పరిమితి ఎత్తివేసింది.
పెయిడ్ యూజర్లతో పాటు ఫ్రీ యూజర్లకూ 'అపరిమిత అవకాశం'యూజర్ల నుంచి ఇంత రెస్పాన్స్ తాము ఊహించలేదని కొన్నాళ్ల క్రితం ఓపెన్‌ఏఐ స్వయంగా ప్రకటించింది. వాస్తవానికి, జిబ్లీ స్టైల్ వాడే వాళ్ల తాకిడికి కంపెనీ జీపీయూ (GPU) వ్యవస్థపై అధిక భారం పడింది & సర్వర్లు హ్యాంగ్ అయ్యాయి. తారస్థాయి స్పందన చూసి ఓపెన్‌ఏఐ భయపడింది. 'జిబ్లీ ఫిల్టర్' వాడే ఫ్రీ యూజర్లపై నియంత్రణ విధించింది, రోజుకు 3 కంటే ఎక్కువ జిబ్లీ స్టైల్ ఇమేజ్‌లు సృష్టించకుండా పరిమితి విధించింది. ఇప్పుడు, ఆ పరిమితిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఏపెన్‌ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయానికి ముందు వరకు, జిబ్లీ స్టైల్ ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను అపరిమితంగా ఉపయోగించుకునే వెసులుబాటు పెయిడ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ChatGPT ప్లస్, ప్రో, టీమ్స్ వినియోగదారుల కోసం OpenAI మార్చి 26న జిబ్లీ ఫిల్టర్‌ను ప్రారంభించింది. ప్రారంభం నుంచే ఇది ప్రజాదరణ పొందింది, భారీ సంఖ్యలో వినియోగదారులు దీనిని ఉపయోగించడం ప్రారంభించారు. ఇప్పుడు పెయిడ్ యూజర్లతో పాటు ఫ్రీ యూజర్ల కూడా జిబ్లీ ఫిల్టర్‌ను అపరిమితంగా వాడుకోవచ్చు.
గంటలో 10 లక్షల మంది కొత్త యూజర్లుజిబ్లీ ఫిల్టర్ పాపులారిటీ ఎంత ఉందంటే.. ఓపెన్‌ఏఐ ప్లాట్‌ఫామ్‌కు కేవలం ఒక గంటలోనే 1 మిలియన్ (10 లక్షల మంది) కొత్త వినియోగదారులు యాడ్ అయినట్లు శామ్ ఆల్ట్‌మన్ వెల్లడించారు. ప్రతి వారం లక్షలాది మంది ChatGPTని ఉపయోగిస్తున్నారని తెలిపారు. దైనందిన జీవితంలో మనం ముందుకు సాగడానికి & రోజువారీ జీవితంలో AIని మరింత ఉపయోగకరంగా మార్చడానికి ఇది సాయపడుతుందన్నారు. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం, జిబ్లీ ట్రెండ్‌కు ఆకర్షితులైన లక్షల మంది యూజర్లు ఓపెన్‌ఏఐ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకుంటున్నారు.
300 బిలియన్ డాలర్ల విలువతాజాగా, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల నుంచి ఓపెన్‌ఏఐ 40 బిలియన్ డాలర్లు సేకరించింది, దీంతో కంపెనీ దాదాపు విలువ రెట్టింపు అయి 300 బిలియన్ డాలర్లకు చేరింది. ఫండింగ్ గ్రూప్‌లోని ఇతర పెట్టుబడిదార్లలో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్, కోట్యూ మేనేజ్‌మెంట్, ఆల్టిమీటర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, థ్రైవ్ క్యాపిటల్ ఉన్నట్లు సమాచారం. 2025 చివరి నాటికి ఓపెన్‌ఏఐలో మరో $30 బిలియన్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఇందులో సాఫ్ట్‌బ్యాంక్ నుండి $22.5 బిలియన్లు మరియు సిండికేట్ నుండి $7.5 బిలియన్లు రావచ్చు.
ఎక్స్‌కు చెందిన గ్రోక్ (Grok)లోనూ ఇమేజ్ జనరేషన్ ఆప్షన్ ఉంది, ఆ ఫీచర్ కూడా యూజర్లు తెగ ఆకర్షిస్తోంది.