డిజిటల్ యుగంలో సమాచారాన్ని సేకరించడం ఒక ఎత్తైతే, దాన్ని అందంగా ప్రజెంట్‌ చేయడం మరో టాస్క్. ఇప్పటి వరకు దీని కోసం చాలా టూల్స్ వాడే ఉంటారు, ఇంకా వాడుతూనే ఉంటారు. గంటల సమయాన్ని వృథా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. గంటల సమయం వృథా కాకుండా క్షణాల్లోనే మీ టాస్క్‌ను పూర్తి చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఫీచర్‌ను గూగుల్‌ సంస్థకు చెందిన నోట్‌బుక్ ఎల్ఎం‌ తీసుకొచ్చింది. ఈ సరికొత్త టూల్‌ ఇప్పుడు ప్రజెంటేషన్‌లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టనుంది. 

Continues below advertisement

గతంలో నోట్‌బుక్ ఎల్‌ఎం అందించే ప్రజెంటేషన్లు అన్నీ ఒకే రకంగా ఉండేవి. రంగు, లేఅవుట్‌ అన్నీ ఒకేలా ఉన్నాయని చాలా మంది నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. ప్రజెంటేషన్ చూస్తే అది ఏఐ టెంప్లేట్ అని స్ఫష్టంగా తెలిసిపోయేది. కాని ఇప్పుడు జెమిని ఏఐ సహాయంతో మనకు నచ్చిన బ్రాండ్‌ స్టైల్‌లో, కస్టమ్‌ డిజైన్లతో వండర్‌ఫుల్ స్లైడ్‌లతో రూపొందించుకోవచ్చు. 

ఇతర ఏఐలకు దీనికి తేడా ఏంటీ?

సాధారణంగా చాట్‌జీపీటీ లేదా ఇతర ఏఐలను ఏదైనా ప్రజెంటేషన్ చేయమని అడిగితే అవి ఇంటర్నెట్‌లోని సాధారణ సమాచారం నుంచి విషయాలను సేకరిస్తాయి. దీని వల్ల కొన్నిసార్లు తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంది. కానీ నోట్‌బుక్ ఎల్ఎమ్‌ ప్రత్యేకత ఏంటంటే,, ఇది కేవలం మీరు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రజెంటేషన్ తయారు చేస్తుంది. మీకు నచ్చినట్టు సోర్స్ ఇవ్వొచ్చు. అది పీడీఎఫ్‌లో కానీ, వీడియో రూపంలో, డాక్యుమెంట్‌ ద్వారా కూడా మీరు సోర్స్‌ ఇవ్వొచ్చు. ఇది మీ సోర్స్‌ పరిధిని దాటి వెళ్లద్దు. తద్వారా కంటెంట్‌ అత్యంత కచ్చితంగా ఉంటుంది.  

Continues below advertisement

స్టైలిష్‌ ప్రజెంటేషన్ల కోసం జెమిని మ్యాజిక్ 

నోట్‌బుక్ ఎల్‌ఎం ఇచ్చే డెఫ్లాల్డ్‌డిజైన్లు కొన్ని సార్లు ప్రొఫెషనల్‌ అవసరాలకు సరిపోవు. దీనిని అధిగమించడానికి ఒక అద్భుతమైన మార్గం అందుబాటులోకి వచ్చింది. ముందుగా గూగుల్ ఇమేజెస్‌లో మీకు నచ్చిన ఒక ఇన్ఫోగ్రాఫిక్ లేదాస్లైడ్‌ డిజైన్‌ను వెతికి ఆ చిత్రాన్ని సేవ్ చేసుకోండి. ఉచిత జెమిని ఏఐని ఉపయోగించి ఆ చిత్రాన్ని అప్‌లోడ్ చేయండి. దాని రంగులు, టైపోగ్రఫీ, లే అవుట్‌ శైలని వివరించమని అడగండి. జెమిని ఇచ్చిన ఆ వివరణను కాపీ చేసి నోట్‌బుక్‌ ఎల్‌ఎమ్‌లోని పెన్సిల్‌ ఐకాన్‌ క్లిక్ చేసి అక్కడ పేస్ట్ చేయండి. ఈ చిన్న ట్రిక్‌ ద్వారా అదే సమాచారాన్ని మీకు నచ్చిన విజువల్ లాంగ్వేజ్‌లో నోట్‌బుక్‌ ఎల్‌ఎమ్‌ అద్భుతంగా తయారు చేస్తుంది. ఇది మీ ప్రజెంటేషన్‌ను ఇతరుల కంటే భిన్నంగా, ఆకర్షణీయంగా మారుస్తుంది. 

డీప్‌ రీసెర్చ్‌ గంటల్లోనే పూర్తి 

ఏదైనా కొత్త అంశంపై ప్రజెంటేషన్ చేయాలంటే గంటల కొద్దీ గూగుల్ సెర్చ్ చేయడం, లింకులు సేవ్ చేసుకోవడం పెద్ద తలపోటు, నోట్‌బుక్‌ ఎల్‌ఎమ్‌లోని డీప్ రీసెర్చ్ ఫీచర్‌ ఈ భారాన్ని తగ్గిస్తుంది. మీరు ఒక టాపిక్‌ ఇస్తే చాలు అది వెబ్‌సైట్లు గిట్‌హబ్‌, రెడ్డిట్‌, రీసెర్చ్ పేపర్లను వెతికి, అత్యంత విలువైన సోర్స్‌లను సేకరిస్తుంది. దీని వల్ల మీకు ఒక రోజంతా చేసే పరిశోధన కేవలం నిమిషాల్లో పూర్తి అవుతుంది. 

స్లైడ్‌ ఎడిట్‌, ఎక్స్‌పోర్ట్

గతంలో ఒక స్లైడ్‌ నచ్చకపోతే మొత్తం ప్రజెంటేషన్‌ను మళ్లీ జనరేట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రివైజ్‌ బటన్ ద్వారా ఒక్కో స్లైడ్‌ను విడివిడిగా మార్చుకోవచ్చు. ఈ స్లైడ్‌ చాలా క్లిష్టంగా ఉంది, దీనికి మూడు బుల్లెట్‌ పాయింట్లుగా మార్చు అని మీరు స్పెసిఫిక్ సూచనలు ఇస్తే, అది వెంటనే మార్పులు చేస్తుంది. 

అంతేకాకుండా, నోట్‌బుక్ ఎల్‌ఎమ్‌లో తయారైన స్లైడ్‌పై ఉండే  వాటర్ మార్క్ సమస్యను కూడా గూగుల్ పరిష్కరించింది. ఇప్పుడు మీరు రూపొందించిన స్లైడ్‌ను నేరుగా పవర్‌పాయింట్‌ ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని వల్ల ఆ ఫైల్‌ను మీరు గూగుల్ స్లైడ్‌లో లేదా పవర్ పాయింట్‌లో ఓపెన్ చేసి, మీకు నచ్చినట్టుగా మరింత ఎడిటింగ్‌ చేసుకోవచ్చు. 

చక్కనైన డేటా టేబుల్ 

నోట్‌బుక్ ఎల్‌ఎమ్‌లో చేరిన మరో కీలక ఫీచర్‌ డేటా టేబుల్స్‌. మీరు ఇచ్చిన సోర్స్‌లలోని సమాచారాన్ని ఒక స్ప్రెడ్‌షీట్‌లా రోస్‌, కాలమ్స్‌లోకి మారుస్తుంది. గూగుల్ నోట్‌బుక్ ఎల్‌ఎమ్‌ కేవలం ఒక రీసెర్చ్ టూల్‌గానే కాకుండా డేటా సేకరణ నుంచి ప్రజెంటేషన్ తయారీ వరకు అన్ని పనులను ఒకే చోట పూర్తి చేసే శక్తివంతమైన టూల్‌గా మారింది.