Penalty On WhatsApp: మెటా/వాట్సాప్‌కి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా తప్పుడు విధానాలు అవలంబించినందుకు మెటాపై రూ.213.14 కోట్ల జరిమానా విధించింది. కమిషన్ జారీ చేసిన ఈ ఆర్డర్ వాట్సాప్ 2021 పాలసీకి సంబంధించినది. ఎందుకంటే ఆ విధానం ప్రకారం వాట్సాప్ వినియోగదారులను ఒత్తిడి చేసి, వారి నుంచి సమాచారాన్ని సేకరించి తర్వాత ఇతర మెటా కంపెనీలతో షేర్ చేసింది.
వాట్సాప్‌కు భారీ జరిమానా...
సీసీఐ ఇచ్చిన సూచనలను నిర్ణీత గడువులోగా అమలు చేయాలని మెటా, వాట్సాప్‌లను కమిషన్ ఆదేశించింది. సీసీఐ ఆదేశాల మేరకు... వాట్సాప్ తన ప్లాట్‌ఫారమ్‌లో సేకరించిన యూజర్ డేటాను ఇతర మెటా కంపెనీలు లేదా మెటా కంపెనీ ఉత్పత్తులతో యాడ్స్ ప్రయోజనాల కోసం తదుపరి ఐదు సంవత్సరాల వరకు పంచుకోకూడదు. భవిష్యత్తులో మెటా ఈ డేటాను ఎక్కడైనా షేర్ చేస్తే యూజర్‌కు తన డేటా ఎక్కడ షేర్ చేస్తున్నారో తెలియాలి. దానికి వారి అనుమతి తీసుకోవాలి.
Also Read: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
ఏ విధమైన ఇతర షరతులు యూజర్ల ముందు ఉంచకూడదు. కంపెనీ పాలసీని ఆమోదించడానికి లేదా అంగీకరించకుండా ఉండటానికి యూజర్‌కు ఆప్షన్ ఉంటుంది. అతన్ని పాలసీకి అంగీకరించాల్సిందిగా బలవంతం చేయకూడదు. భవిష్యత్తులో ఏదైనా అప్‌డేట్ వచ్చినా యూజర్ అలాంటి పాలసీలను అనుసరించాల్సిన అవసరం లేదు.
ప్రశ్నలు ఎందుకు వచ్చాయి?
2021 జనవరి నుంచి వాట్సాప్ దాని సర్వీస్ నిబంధనలు, ప్రైవసీ పాలసీలకు సంబంధించిన అప్‌డేట్‌ల గురించి వినియోగదారులకు తెలియజేసింది. 2021 ఫిబ్రవరి 8వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం వినియోగదారులు వాట్సాప్‌ని ఉపయోగించడం కొనసాగించడానికి కంపెనీతో కాస్త ముఖ్యమైన డేటాను షేర్ చేయాల్సి ఉంటుందని యాప్‌లోని నోటిఫికేషన్ పేర్కొంది.
ఆ సమయంలో పాలసీని అంగీకరించడం తప్ప వినియోగదారులకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. వాట్సాప్‌ను మళ్లీ ఉపయోగించుకోలేని పరిస్థితి ఏర్పడినందున వినియోగదారులందరూ తప్పక యాక్సెప్ట్ చేశారు. వాట్సాప్ ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్‌గా ఉంది. కేవలం పర్సనల్ అవసరాల కోసం మాత్రమే కాకుండా ప్రొఫెషనల్‌గా కూడా వాట్సాప్‌ను ప్రజలు ఉపయోగిస్తూ ఉంటారు.
Also Read: రూ.11కే 10 జీబీ డేటా - బెస్ట్ ప్లాన్ తెచ్చిన జియో - కానీ వ్యాలిడిటీ మాత్రం!