Airtel Vs Jio Monthly Monthly Recharge Plan: మన దేశంలోని ప్రధాన టెలికాం కంపెనీలు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోకు కోట్లాది మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. కొంతమంది ఒక్క కంపెనీ సిమ్‌నే వినియోగిస్తుండగా, చాలా ఎక్కువ మంది దగ్గర ఈ రెండు కంపెనీల సిమ్‌లు ఉన్నాయి. ఎయిర్‌టెల్ & జియో నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లు రెండూ వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. రిలయన్స్ జియో - డైలీ 1 GB డేటా లేదా 1.5 GB డేటా లేదా 2 GB డేటా ఆప్షన్స్‌తో మంత్లీ రీఛార్జ్ ప్లాన్‌లను ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్ విషయానికి వస్తే - రోజుకు 1 GB డేటా లేదా 2 GB డేటాతో నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది.
ఎయిర్‌టెల్ నెలవారీ రీఛార్జ్ ప్లాన్స్ (Airtel Monthly Recharge Plans)ఎయిర్‌టెల్ లిస్ట్‌లో 30 రోజుల చెల్లుబాటు (Validity)తో రూ. 211 రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో ప్రతి సబ్‌స్క్రైబర్ రోజుకు 1 GB డేటాను పొందుతాడు. ఎయిర్‌టెల్ రెండో నెలవారీ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 398. ఈ ప్లాన్ చెల్లుబాటు 28 రోజులు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో యూజర్‌కు అపరిమిత లోకల్, STD లేదా రోమింగ్ కాల్స్ అందుబాటులోకి వస్తాయి. ఇదే ప్లాన్‌లో రోజుకు 100 SMSలు పంపుకోవచ్చు. అలాగే, IPL మ్యాచ్‌లు సహా వివిధ స్ట్రీమింగ్స్, ఇతర వీడియోలు చూసేందుకు వీలుగా ప్రతి రోజూ 2 GB డేటా పొందుతారు.
ఎయిర్‌టెల్ రూ. 398 రీఛార్జ్ ప్లాన్ మరో నాలుగు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్ 28 రోజుల పాటు అపరిమిత 5G డేటాను ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు, జియో హాట్‌స్టార్ (JioHotstar) మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా 28 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. ఈ ప్లాన్‌లోనే, యూజర్ ఏదైనా ఒక హలో ట్యూన్‌ను ఒక నెల రోజుల పాటు ఉచితంగా సెట్ చేసుకోవచ్చు. సబ్‌స్క్రైబర్ మొబైల్‌కు స్పామ్ కాల్ వచ్చినప్పుడు అలర్ట్ (Airtel spam call alert) కూడా కనిపిస్తుంది.
జియో నెలవారీ రీఛార్జ్ ప్లాన్స్ (Jio Monthly Recharge Plans)ఎయిర్‌టెల్ లాగే, జియో కూడా అనేక రకాల ప్రయోజనాలతో నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లను అమ్ముతోంది. జియో రూ. 319 మంత్లీ ప్లాన్‌తో రోజుకు 1.5 GB డేటాను యూజర్ ఆస్వాదించవచ్చు. ఇది క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ (calendar-month validity)ని అందిస్తుంది. అంటే, ఒక యూజర్ ఒక నెలలో ఏ తేదీన ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే, మరుసటి నెలలో మళ్లీ అదే తేదీ వరకు ఈ ప్లాన్ చెల్లుబాటు అవుతుంది. వ్యాలిడిటీ పిరియడ్‌లో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వాయిస్ కాల్ చేయలేని పరిస్థితిలో ఉన్నా లేదా డిస్టబెన్స్ అనుకున్నా అవతలి వ్యక్తితో సంప్రదింపుల కోసం రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్రయోజనాలతో పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీకి 90 రోజుల సబ్‌స్క్రిప్షన్ కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో 50 GB జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ (Jio AI Cloud Storage) కూడా అందుబాటులోకి వస్తుంది, ఈ ఫెసిలిటీని ఈ మధ్యే అందరు యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
జియో, తన సబ్‌స్క్రైబర్లకు 28 రోజుల చెల్లుబాటుతో రోజుకు 2 GB డేటా రీఛార్జ్ ప్లాన్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. దీనిలో కూడా అపరిమిత కాల్స్ & రోజుకు 100 SMSలు చేయవచ్చు. ఈ ప్లాన్ ద్వారా సబ్‌స్క్రైబర్ 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్‌స్క్రిప్షన్ పొందుతాడు. 50 GB జియో AI క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉచితంగా లభిస్తుంది.
ఏ ప్లాన్ బెటర్?ఇది సరైన సమాధానం లేని ప్రశ్న. యూజర్ అవసరాలను బట్టి ప్లాన్ ప్రాధాన్యత మారిపోతుంది. డైలీ డేటాతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకుని మంత్లీ రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.