Surya Tilak of Lord Ram at Ayodhya temple | అయోధ్య: నేడు దేశం మొత్తం శ్రీరామ నామంతో మార్మోగుతోంది. రామయ్య ఆలయాలకు, పుణ్యక్షేత్రాలకు భక్తులు క్యూ కట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir)లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గత ఏడాది జనవరిలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట అనంతరం వచ్చిన నేడు రెండో శ్రీరామ నవమి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అయోధ్య ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలోని బాలరాముడి విగ్రహం నుదిటిపై సూర్య తిలకంతో మరపురాని ఘట్టాన్ని భక్తులు వీక్షించారు. ఆలయం నిర్మాణం సమయంలోనే సూర్య కిరణాలు స్వామివారి నుదిట తిలకం దిద్దేలా పక్కాగా ప్లాన్ చేశారు. రామయ్యకు సూర్య తిలకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయోధ్య ఆలయం నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కు చెందిన శాస్త్రవేత్తలు, నిపుణులు కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు అయోధ్య రామాలయంలో సూర్య తిలకం వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేందుకు ఏర్పాటు చేశారు.
కటకాలతో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు..
రామయ్య విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడటానికి ఆలయం మూడో అంతస్తులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొన్ని కుంభాకార, పుటాకార కటకాలతో కొన్ని పైపులతో కలిపి ఓ విధానాన్ని ఇక్కడ రూపొందించారు. మొదట ఆలయం పై భాగంలో సూర్యకాంతిని గ్రహించేందుకు ఒక పరికరం ఉంటుంది. అక్కడ గ్రహించిన సూర్యకాంతి పైపులోపల ఏర్పాటు చేసిన కటకాల ద్వారా ప్రసరించి అచ్చం తిలకం వలే కనిపిస్తుంది. సరిగ్గా బాలరాముడి నుదుట సూర్యకిరణాలు తిలకంగా పడతాయి. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
ప్రతి శ్రీరామ నవమి రోజున అయోధ్య ఆలయంలో సూర్య తిలకం ఆవిష్కృతమవుతోంది. అందుకోసం ప్రత్యేక మెకానిజం ఉంది. గేర్ టీత్ మెకానిజం ద్వారా 365 రోజులు కాంతిని గ్రహించే అద్దం కదులుతుంటోంది. సరిగ్గా శ్రీరామనవమి సందర్భంగా నిర్ణీత చోటుకు అది వచ్చి చేరుతుంది. ఆలయం నిర్మాణంలో కేవలం వాస్తునే కాదు ఎన్నో శాస్త్ర, సాంకేతిక విషయాలను పరిగణనలోకి తీసుకున్నారని తెలిసిందే.
గత ఏడాది జనవరిలో రాముడి ప్రాణపతిష్ట తరువాత అయోధ్య రామాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కోట్ల సంఖ్యలో అయోధ్య బాలరాముడ్ని దర్శించుకుని ఆయన ఆశీర్వదం పొందుతున్నారు. మహాకుంభమేళా సమయంలోనూ త్రివేణి సంగమానికి వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు అటు నుంచి యూపీలోని అయోధ్యకు వెళ్లారు. రాముడి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.