అమెజాన్ సంస్థకు చెందిన వాయిస్ అసిస్టెంట్ అలెక్సా తన యూజర్లను ఆకర్షించేందుకు కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఇకపై మనం 'హే అలెక్సా' అనగానే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ వాయిస్‌ బదులిస్తుంది. అమెజాన్ అలెక్సాలో బిగ్‌బీ గొంతు వినాలంటే మాత్రం కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుందని సంస్థ తెలిపింది. దీని కోసం ఏడాదికి రూ.299 చెల్లించాలని తెలిపింది. అయితే ప్రస్తుతం ప్రారంభ ఆఫర్ కింద ఏడాదికి రూ.149 చెల్లిస్తే సరిపోతుందని పేర్కొంది. దీనికి సంబంధించి అలెక్సా ఇండియా.. బిగ్‌బీ ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. 






సెలబ్రిటీ వాయిస్ కొనుగోలు చేయాలంటే మనం.. 'అలెక్సా, ఇంట్రడ్యూస్‌ మీ టూ అమితాబ్ బచ్చన్‌' అని అడగాలి. లేదా అమెజాన్ వెబ్‌సైట్ నుంచి కూడా డబ్బు చెల్లించవచ్చు. సొమ్ము చెల్లించాక మనం అమితాబ్ వాయిస్‌తో ఇంటరాక్ట్ అవ్వొచ్చు. 'అమిత్ జీ' అని పలకరిస్తే అలెక్సా బదులిస్తుంది.





వాయిస్ అసిస్టెంట్ ద్వారా యాక్టర్లను మాట్లాడించడాన్ని అమెజాన్ 2019లో ప్రవేశపెట్టింది. హాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ శామ్యుల్ ఎల్ జాక్సన్ వాయిస్‌తో అలెక్సా బదులిచ్చేది. తాజాగా దీనిని ఇండియాకు కూడా తీసుకొచ్చింది. సెలబ్రిటీ వాయిస్ ఫీచర్ ద్వారా కొత్త వినియోగదారులను ఆకర్షించాలని అమెజాన్ భావిస్తోంది. 


కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లు సమాచారం కూడా..
కోవిడ్ 19 సంబంధించిన సమాచారం అందించేందుకు అలెక్సా సాయం చేస్తుంది. అలెక్సా ద్వారా మనకు సమీపంలో టెస్టింగ్ కేంద్రాలు, వ్యాక్సినేషన్ సెంటర్లు వివరాలు తెలుసుకోవచ్చు. ఇది కేవలం భారత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. వీటితో పాటు కోవిడ్ హెల్ప్‌లైన్‌ నంబర్లు, వ్యాక్సినేషన్ గురించిన ప్రశ్నలకు అలెక్సా సమాధానాలు ఇస్తుంది. 2020లో కోవిడ్ లక్షణాలు, కేసుల గురించిన సమాచారాన్ని అలెక్సా అందించింది.


Also Read: Smart Watches: ఈ 8 స్మార్ట్ వాచ్ లు చూడండి.. మీ చేతికి స్మార్ట్ గా కనిపిస్తాయి.. బ్యాటరీ కూడా మామూలుగా ఉండదు


Also Read: Discounts on Smart Phones: ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్.. ఏయే ఫోన్ల ధర తగ్గుతుందంటే?