భారతీ ఎయిర్‌టెల్ తన అత్యంత చవకైన రూ.199 ప్లాన్‌ను తిరిగి తీసుకువచ్చింది. అయితే ఈసారి ఎక్కువ వ్యాలిడిటీతో ఈ ప్లాన్ లాంచ్ అయింది. 2021 టారిఫ్ హైక్‌లకు ముందు ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1 జీబీ డేటాను అందించారు. ప్లాన్ వ్యాలిడిటీ 24 రోజులుగా ఉండేది. ఇప్పుడు దీని ద్వారా మొత్తంగా 3 జీబీ డేటాను అందిస్తున్నారు. వ్యాలిడిటీని మాత్రం 30 రోజులకు పెంచారు. అదనపు లాభాలు కూడా అందించారు.
ఈ కొత్త ప్లాన్ ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ ఇండియా సైట్‌లో అందుబాటులో ఉంది. డేటా అయిపోయాక ప్రతి ఎంబీకి 50 పైసలు చార్జ్ చేయనున్నారు. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు. 300 ఎస్ఎంఎస్‌లు కూడా ఈ ప్లాన్‌తో అందించనున్నారు. వింక్ మ్యూజిక్‌కు ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా లభించనుంది. జియో, వొడాఫోన్‌ల్లో నెలవారీ ప్లాన్లతో ఈ రూ.199 ప్లాన్ పోటీ పడనుంది.
ఎయిర్‌టెల్ 5జీ 10 లక్షల యూజర్ మార్కును దాటిందని ఇటీవలే కంపెనీ ప్రకటించింది. లాంచ్ అయిన నెలరోజుల్లోనే కంపెనీ ఈ మార్కును చేరుకోవడం విశేషం. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌ను నిర్మించడం, రోల్‌అవుట్‌ను పూర్తి చేయడం కొనసాగిస్తున్నందున దశలవారీగా ఈ సేవలు అందజేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ ఎన్ఎస్ఏ టెక్నాలజీపై నడుస్తుంది. భారతదేశంలోని అన్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో సజావుగా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌తోనే 5జీని ఎంజాయ్ చేయవచ్చు.
5జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న కస్టమర్‌లు రోల్‌అవుట్ మరింత విస్తృతమయ్యే వరకు వారి ప్రస్తుత డేటా ప్లాన్‌లతోనే హై-స్పీడ్ ఎయిర్‌టెల్ 5జీ ప్లస్‌ని ఆస్వాదించవచ్చు. అలాగే మెరుగైన వాయిస్ ఎక్స్‌పీరియన్స్, కాల్ కనెక్ట్‌తో పాటుగా ప్రస్తుతం ఉన్న దాని కంటే 20 నుంచి 30 రెట్లు అధిక వేగంతో డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. చివరగా ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్ కూడా పర్యావరణానికి అనుకూలంగానే ఉందని పేర్కొంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?