ఎయిర్‌టెల్ 5జీ 10 లక్షల యూజర్ మార్కును దాటిందని కంపెనీ ప్రకటించింది. లాంచ్ అయిన నెలరోజుల్లోనే కంపెనీ ఈ మార్కును చేరుకోవడం విశేషం. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి నగరాల్లో ఎయిర్‌టెల్ 5జీ సర్వీసులు ప్రారంభం అయ్యాయి.
ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్‌ను నిర్మించడం, రోల్‌అవుట్‌ను పూర్తి చేయడం కొనసాగిస్తున్నందున దశలవారీగా ఈ సేవలు అందజేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ ఎన్ఎస్ఏ టెక్నాలజీపై నడుస్తుంది. భారతదేశంలోని అన్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో సజావుగా పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న ఎయిర్‌టెల్ 4జీ సిమ్‌తోనే 5జీని ఎంజాయ్ చేయవచ్చు.
5జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న కస్టమర్‌లు రోల్‌అవుట్ మరింత విస్తృతమయ్యే వరకు వారి ప్రస్తుత డేటా ప్లాన్‌లతోనే హై-స్పీడ్ ఎయిర్‌టెల్ 5జీ ప్లస్‌ని ఆస్వాదించవచ్చు. అలాగే మెరుగైన వాయిస్ ఎక్స్‌పీరియన్స్, కాల్ కనెక్ట్‌తో పాటుగా ప్రస్తుతం ఉన్న దాని కంటే 20 నుంచి 30 రెట్లు అధిక వేగంతో డెలివరీ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. చివరగా ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ నెట్‌వర్క్ కూడా పర్యావరణానికి అనుకూలంగానే ఉందని పేర్కొంది.
ఎయిర్‌టెల్ 5జీతో పని చేసే 5జీ రెడీ స్మార్ట్ ఫోన్లు
యాపిల్ ఐఫోన్‌లు మినహా అన్ని 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లు ఈ నెల మధ్యలో ఎయిర్‌టెల్ 5జీ సేవలకు సపోర్ట్ చేయడం ప్రారంభిస్తాయని భారతీ ఎయిర్‌టెల్ సీనియర్ అధికారి తెలిపారు. కంపెనీ ఎర్నింగ్స్ కాల్ సమయంలో భారతి ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్, నవంబర్ మొదటి వారంలో యాపిల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేస్తుందని, దాని అన్ని డివైస్‌లు డిసెంబర్ మధ్య నాటికి కంపెనీ 5జీ సేవలకు మద్దతు ఇస్తాయని ధృవీకరించారు.
రానున్న 6-9 నెలల్లో తదుపరి తరం సేవల ధరలపై ఎయిర్‌టెల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎయిర్‌టెల్ అతిపెద్ద పోటీదారు జియో కూడా గత నెలలో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నగరాల్లో తన ట్రూ 5జీ సేవల బీటా ట్రయల్‌ను ప్రకటించింది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?