మనదేశంలో 5జీ రోల్‌అవుట్ మనదేశంలో అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 12వ తేదీ కల్లా 5జీ సేవలు మనదేశంలో ప్రారంభం అవుతాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం ఇచ్చారు. కంపెనీలకు స్పెక్ట్రం అలొకేషన్ లెటర్లు కూడా అందాయి. మొదటగా 13 నగరాల్లో ఈ సేవలను అందించనున్నారు.


అహ్మదాబాద్, బెంగళూరు, చండీగర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే నగరాల్లో 5జీ సేవలు మొదటగా ప్రారంభం కానున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్, వొడాఫోన్ ఐడియాల నుంచి టెలికాం శాఖకు ఇప్పటికే రూ.17,876 కోట్లు అందాయి.


పైన పేర్కొన్న 13 నగరాల్లో మొదటగా 5జీ ప్రారంభం కానుంది. ఆ తర్వాత దశల వారీగా 5జీని అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తిగా దేశం మొత్తం 5జీ కవరేజ్ రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. మనదేశంలో 5జీ టెస్టింగ్ అయితే ఇప్పటికే ప్రారంభం అయింది.


కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ అయితే ఇంతవరకు 4జీని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే 5జీని త్వరలో బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకురానుందని వార్తలు వస్తున్నాయి. 5జీ సర్వీసుల కోసం బీఎస్ఎన్ఎల్ ఇటీవలే టెలికమ్యూనికేషన్స్ డిపార్టెమెంట్ పర్మిషన్ కోరింది. ఈ పర్మిషన్ వస్తే త్వరలో బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ అందుబాటులోకి రానున్నాయి. కానీ దానికి ముందు చాలా విషయాలు జరగాలి.


5జీ ఎన్ఎస్ఏను తీసుకురానున్న బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ 5జీ ఎన్ఎస్ఏ నెట్‌వర్క్స్‌తో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా బేస్ 4జీ కోర్ నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. 5జీ ఎస్ఏ కంటే 5జీ ఎన్ఎస్ఏ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఎందుకంటే 5జీ ఎస్ఏకు పూర్తిగా కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అంత బడ్జెట్ బీఎస్ఎన్ఎల్ దగ్గర ఉందో లేదో తెలియరాలేదు.


ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, బీఎస్ఎన్ఎల్ 5జీ 2023లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అది బీఎస్ఎన్ఎల్‌కు మంచిదనే చెప్పాలి. 4జీ ఆలస్యం కావడంతో బీఎస్ఎన్ఎల్‌కు చాలా డ్యామేజ్ జరిగింది. దీంతో ప్రభుత్వానికి, బీఎస్ఎన్ఎల్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం అత్యవసరం అని తెలిసి ఉంటుంది. ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్ ప్లాన్లలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్లే తక్కువ ధరలో ఉన్నాయి. 5జీలో కూడా చవకైన ప్లాన్లు తీసుకొస్తే బీఎస్ఎన్ఎల్ తిరిగి టెలికాం రంగంలో ముందుకు వచ్చే అవకాశం ఉంది.


ఎఫ్ఈ కథనం ప్రకారం బీఎస్ఎన్ఎల్ 70 మెగాహెర్ట్జ్ బ్యాండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే 40 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌కు మాత్రమే అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ సిఫారసులనే టెలికాం డిపార్ట్‌మెంట్ ఫాలో అవుతుంది. 70 మెగాహెర్ట్జ్ ఎయిర్ వేవ్స్‌ను బీఎస్ఎన్ఎల్ కోసం రిజర్వ్ చేస్తే ప్రైవేట్ టెలికాం సంస్థలకు 5జీ ఎయిర్ వేవ్స్ కొరత ఏర్పడుతుంది టెలికాం డిపార్ట్‌మెంట్ అభిప్రాయపడుతోంది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!