IT Recruitment: ఏప్రిల్ నెల భారతదేశం ఐటీ రంగం  శుభవార్త చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్‌లతో టెన్షన్ పడుతున్న ఐటీ ఉద్యోగులకు ఇది నిజంగానే మంచి గుడ్ న్యూస్‌. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఉపశమనకరమైన విషయం ఏమిటంటే, ఈ రంగంలో నియామకాలు 16% పెరిగాయి. జాబ్ ప్లాట్‌ఫామ్ 'ఫౌండ్ఇట్' నివేదిక 'ఫౌండ్ఇట్ ఇన్‌సైట్స్ ట్రాకర్'లో ఈ సమాచారం వెల్లడైంది. 

ఈ నివేదిక ప్రకారం, కంపెనీలు ఇప్పుడు నైపుణ్యాలను పరిగణలోకి తీసుకొని నియామకాలు చేపడుతున్నట్టు వెల్లడైంది. దాదాపు 62% ఐటీ కంపెనీలు ఇప్పుడు డిగ్రీల కంటే అభ్యర్థి  నిజమైన పనితీరు, ప్రతిభను  చూస్తున్నాయి. 

అంటే మీకు సరైన సాంకేతిక నైపుణ్యాలు ఉంటే, మీకు ఉద్యోగం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు అని అర్థం. మీకు ఎంత పెద్ద డిగ్రీ ఉన్నా లేకపోయినా మీరు టాలెంట్ నిరూపించుకుంటే ఉద్యోగం వెతుక్కొని వస్తుంది. 

ఏ ఉద్యోగాలకు అత్యధిక డిమాండ్?

నివేదిక ప్రకారం, కృత్రిమ మేధ (AI), మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి రంగాల‌్లో అత్యధిక నియామకాలు జరుగుతున్నాయి. మొత్తం ఐటీ ఉద్యోగాలలో 95% పోస్టింగ్‌లు ఈ డొమైన్‌లతో ముడిపడి ఉన్నాయి.

సత్తా చాటుకుంటున్న చిన్న పట్టణాలు 

కోయంబత్తూర్ (40%), అహ్మదాబాద్ (17%) బరోడా (15%) వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగాల‌్లో భారీ పెరుగుదల కనిపించింది. హైబ్రిడ్ వర్క్ మోడల్ , కాస్ట్‌ ఆఫ్ లివింగ్ తక్కువ ఉన్న ఈ నగరాలను కంపెనీలు ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడుతున్నాయి.

మెట్రో నగరాల్లో బిగ్ లీడర్లదే రాజ్యం  

బెంగళూరు, ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి మెట్రో నగరాల్లో బిగ్‌ కంపెనీలు భారీగానే రిక్రూట్ చేసుకుంటున్నాయి. టీం లీడ్స్‌ నియామకాలు ఇప్పటికీ అత్యధికంగా జరుగుతున్నాయి. ఈ నగరాల్లో ఈ నియామకాల ప్రక్రియ ఏప్రిల్ నెలలో దాదాపు 7-9% పెరుగుదల నమోదైంది.

GCCలు వేగాన్ని ఇచ్చాయి

గ్లోబల్ కాప్టివ్ సెంటర్లు (GCCలు) అంటే అంతర్జాతీయ క్లయింట్ల కోసం పనిచేసే కంపెనీల భారతీయ శాఖలు, అవి 1.1 లక్షల కొత్త టెక్ ఉద్యోగాలను అందించడంలో ఎక్కువగా దోహదపడ్డాయి. దీని వలన ఐటీ నియామకాలు మరింత పెరిగాయి.

విదేశీ పెట్టుబడిదారుల జాగ్రత్త 

అయితే, ఏప్రిల్‌లో ఐటీ రంగానికి షాక్‌లు  కూడా తగిలాయి. విదేశీ పెట్టుబడిదారులు తరలిపోయిన విషయం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు $1.8 బిలియన్ (సుమారు 15 వేల కోట్ల రూపాయలు) పెట్టుబడులు  వదిలి వెళ్ళారు. ఈ క్షీణత పెద్ద ఐటీ కంపెనీల ఆదాయం తగ్గడం, ఆయా కంపెనీలు ముందు  జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయాలు కారణంగా జరిగింది. ఈ గణాంకాలను NDTV ప్రాఫిట్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ డేటా నుంచి తీసుకుంది.

నైపుణ్యం ఉంటే ఉద్యోగం ఉంది

మొత్తంమీద, భారతదేశం ఐటీ రంగం మళ్ళీ వేగాన్ని పుంజుకుంటోందని చెప్పడానికి చాలా అంశాాలు ఉన్నాయి. కంపెనీలు ఇప్పుడు డిగ్రీలను మాత్రమే చూడడం లేదు, కానీ నిజమైన నైపుణ్యాల కోసం వెతుకుతున్నాయి. కాబట్టి మీరు సాంకేతికతలో ఏదైనా నైపుణ్యంలో నిపుణులైతే, ఇది మీకు ఉద్యోగం పొందడానికి అద్భుతమైన అవకాశం. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు అప్లై చేసుకోండి.