India's Davis Cup captain: భారత డేవిస్‌ కప్‌ కెప్టెన్‌గా జీషన్‌ అలీ(Zeeshan Ali) నియమితుడయ్యాడని ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అనిల్ ధూపర్ తెలిపారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నాన్ ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్(Rohit Rajpal) జట్టుతో కలిసి ప్రయాణించలేకపోయాడని.. అందుకే సీనియర్ ఆటగాడు అయిన జీషన్ అలీని జట్టుకు కెప్టెన్‌గా నియమించామని ధూపర్ వెల్లడించారు. 60 ఏళ్ల తర్వాత భారత టెన్నిస్‌ జట్టు తొలిసారిగా పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది. భారత డేవిస్‌ కప్‌ జట్టుకు పాకిస్థాన్‌ పటిష్ట భద్రత కల్పించింది. అయిదంచెల భద్రతను భారత జట్టుకు కేటాయించారు. జీషన్‌ అలీ తండ్రి అక్తర్‌ 1964లో పాక్‌లో పర్యటించిన భారత జట్టులో కీలక ఆటగాడు.


పాక్‌లో డేవిస్‌ జట్టు
అరవై ఏళ్ల తర్వాత ఇండియా డేవిస్‌ కప్‌ జట్టు(Indian Davis Cup Team) తొలిసారి పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. ఫిబ్రవరిలో డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌ 1 ప్లే ఆఫ్స్‌ ఆడేందుకు భారత బృందం పాకిస్తాన్‌లో కాలుమోపింది. ఇస్లామాబాద్‌లోని స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య ఫిబ్రవరి 3, 4వ తేదీల్లో డేవిస్‌ కప్‌ టై మ్యాచ్‌ జరుగనుంది. అంతకుముందు భారత డేవిస్‌ కప్‌ జట్టు తొలిసారి 1964లో పాక్‌కు వెళ్లింది. ఆ ఏడాది లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-0తో పాక్‌ను చిత్తు చేసింది. 2019లోకజకిస్థాన్‌ వేదికగా తలపడిన టై మ్యాచ్‌లోనూ భారత్‌ 4-0తో విజేతగా నిలిచింది. దాంతో, 2019లో మాదిరిగానే ఈసారి కూడా తటస్థ వేదికపై టై మ్యాచ్‌ నిర్వహించాలని అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్యను భారత టెన్నిస్‌ సమాఖ్య అధికారులు కోరారు.


పాకిస్థాన్‌ చేరుకున్న అయిదుగురు సభ్యుల భారత జట్టుకు అధ్యక్ష తరహా భద్రతను కల్పించారు. ప్లేయర్ల భద్రతపై ఆందోళన వ్యక్తమవడంతో.. ఎక్కడా రాజీపడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు పాకిస్థాన్‌ టెన్నిస్‌ సమాఖ్య(Pakistan Tennis Federation) తెలిపింది. భారత బృందం చుట్టూ నాలుగు లేదా ఐదంచెల భద్రతా వలయం ఉంటుందని చెప్పింది. 1964లో చివరిసారి భారత డేవిస్‌కప్‌ జట్టు పాక్‌లో పర్యటించింది. 1973, 2019లో తటస్థ వేదికలపై పాక్‌తో తలపడింది. అయితే, ఈసారి వేదికను మార్చాలని అఖిల భారత టెన్నిస్‌ సమాఖ్య తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన సీనియర్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న పాకిస్తాన్‌కు వెళ్లలేదు.


డేవిస్‌ కప్‌ జట్టు: జీషన్‌ అలీ( కెప్టెన్‌‌) యుకీ బ్రాంబీ, రామ్‌కుమార్‌ రామనాథన్‌, ఎన్‌.శ్రీరాం బాలాజీ, సాకేత్‌ మైనేని, నికీ కలియండా పూనచ, దిగ్విజరు ఎస్డీ ప్రజ్వల్‌ దేవ్‌(రిజర్వ్‌).


బొప్పన్న చరిత్ర
భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి ఆస్ట్రేలియా ఓపెన్‌ టెన్నిస్‌ మెన్స్‌ డబుల్స్‌ను టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియన్‌ ప్లేయర్ ఎబ్డెన్‌తో కలిసి ఆడిన బోపన్న 7-6,7-5 తేడాతో ఇటలీ జోడి సిమోన్‌- వావాసోరి జోడీపై జయభేరి మోగించారు. తద్వారా తొలిసారి పురుషుల డబుల్స్‌ గ్రాండస్లామ్‌ టైటిల్‌ నెగ్గిన ఆటగాడిగా భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న నిలిచాడు. అతిపెద్ద వయసులో ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడిగానూ 43 ఏళ్ల రోహన్ బోపన్న రికార్డులు తిరగరాశాడు. ఇటీవల అతిపెద్ద వయసులో డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ చేరుకున్న రోహన్ బోపన్న తాజాగా గ్రాండ్ స్లామ్ డబుల్స్ విజేతగా అవతరించాడు.