Gautam Gambhir and MS Dhoni: 2011లో టీమ్ ఇండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినప్పటి డ్రెస్సింగ్ రూమ్ కథలు మనం తరచుగా వింటూనే ఉంటాం. ఆ సమయంలో జట్టులోని ఆటగాళ్లు, సిబ్బంది ఈ చారిత్రాత్మక విజయం గురించి అనేక ఇంటర్వ్యూలలో చెబుతారు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ దానికి సంబంధించిన ఒక కొత్త చిన్న కథను పంచుకున్నాడు. ఈ కథలో అతను మహేంద్ర సింగ్ ధోనిని ప్రశంసించాడు.
భారతదేశం, శ్రీలంక మధ్య జరిగిన మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో మొదటి మ్యాచ్ సందర్భంగా గౌతం గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ, అతని మధ్య ముఖ్యమైన భాగస్వామ్యానికి సంబంధించిన ఒక ఉదంతాన్ని చెప్పాడు.
ఆ సమయంలో మహేంద్ర సింగ్ ధోని తనకు చాలా సపోర్ట్ చేశాడని, తాను సెంచరీ కొట్టాలని కోరుకున్నాడని తెలిపాడు. అతను ఎప్పుడూ తాను వందల స్కోర్ చేస్తూ ఉండాలని కోరుకునేవాడని పేర్కొన్నాడు. ఓవర్ల మధ్యలో తనను టైం తీసుకోమని, తొందరపడద్దని సలహా ఇచ్చేవాడట. అవసరమైతే ధోనినే వేగంగా స్కోర్ చేయడం ప్రారంభిస్తానన్నాడట.
గౌతం గంభీర్ భారీ ఇన్నింగ్స్
2011 ప్రపంచకప్‌లో భారత్-శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు కేవలం 31 పరుగులకే సచిన్ (18), సెహ్వాగ్ (0) వికెట్లను కోల్పోయింది. ఇక్కడి నుంచి గౌతమ్ గంభీర్ మొదట విరాట్ కోహ్లీ (35), తర్వా ఎంఎస్ ధోనీతో కలిసి భారత జట్టును గేమ్‌లోకి తీసుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో 97 పరుగుల వద్ద గౌతం గంభీర్ ఔటయ్యాడు. అదే సమయంలో ధోనీ 79 బంతుల్లో 91 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విన్నింగ్ సిక్స్ కూడా కొట్టాడు. 28 ఏళ్ల తర్వాత ఇక్కడ వన్డే ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంఎస్ ధోనీ, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా యువరాజ్ సింగ్ ఎంపికయ్యారు.