Wrestlers Protest:
దిల్లీలో భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు వారికి అండగా నిలుస్తున్నారు. అథ్లెట్లకు న్యాయం జరగాలని కోరారు. కపిల్‌దేవ్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ సోషల్ మీడియాలో సపోర్ట్ ఇచ్చారు.
భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ను (Brij Bhushan Sharan Singh) తొలగించాలని రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఐదు రోజులుగా జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. మహిళా రెజ్లర్లను ఆయన లైంగికంగా వేధించారని, శారీరకంగా ఇబ్బంది పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. బ్రిజ్ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఆయనపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసి దర్యాప్తు చేపడతామని దిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
బహిరంగంగా ఆందోళన చేస్తున్నప్పటికీ క్రికెటర్లు తమకు మద్దతు ఇవ్వకపోవడంతో వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) మీడియాలో మాట్లాడింది. తమకు అండగా లేకపోయినా కనీసం తటస్థంగానైనా మాట్లాడాలని కోరింది. 'మీరు మాకు అనుకూలంగా మాట్లాడాలని కోరడం లేదు. కనీసం తటస్థ సందేశమైనా ఇవ్వండి. న్యాయం ఎటువైపు ఉంటే వారే గెలవాలని మాట్లాడండి. క్రికెట్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్ క్రీడాకారులు మాట్లాడకపోవడం బాధగా అనిపిస్తోంది' అని పేర్కొంది.
'దేశంలో పెద్ద పెద్ద క్రీడాకారులు లేరని కాదు. క్రికెటర్లు ఉన్నారు. అమెరికాలో బ్లాక్ లైవ్స్ మ్యాటర్‌కు మద్దతుగా మాట్లాడారు. మేము ఆ మాత్రమైనా కనిపించడం లేదా! మేం గెలిచినప్పుడు ముందుకొచ్చి అభినందనలు చెప్తారు. క్రికెటర్లూ అండగా ఉంటారు. కానీ ఇప్పుడేమైంది? వ్యవస్థను చూసి భయపడుతున్నారా? లేదా అక్కడా ఏమైనా అనుమానాస్పదంగా జరుగుతోందా' అని వినేశ్ ప్రశ్నించింది.
వినేశ్ ఆవేదనకు క్రికెటర్లు స్పందించారు. 'ఎప్పటికైనా వారికి న్యాయం జరుగుతుందా' అని కపిల్‌దేవ్ (Kapil Dev) ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రశ్నించారు. 'భారత్‌ను గర్వపడేలా చేసిన రెజ్లర్లు వీధుల్లో ఆందోళన చేయడం బాధకలిగిస్తోంది' అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 'ఇది చాలా సున్నితమైన వ్యవహారం. నిస్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి' అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. 'పతకాలు తెచ్చినప్పుడే కాదు.. భారత అథ్లెట్లు ఎప్పటికీ మనకు గర్వకారణమే' అని కొనసాగించాడు. 'ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఎవరికీ అన్యాయం జరగొద్దు' అని జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా అన్నాడు. 'మన ఒలింపిక్, ప్రపంచ పతక విజేతలు ఇలాంటి స్థితిలో ఉండటం బాధాకరం' అని వరల్డ్ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపింది.