Bajrang Punia vs Yogeshwar Dutt:
రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. దిల్లీ వీధుల్లో ఇన్నాళ్లూ నిరసన చేపట్టిన బజరంగ్ పునియా చెప్పేవన్నీ అవాస్తవాలేనని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్ అంటున్నాడు. ఉద్దేశపూర్వకంగా తానెప్పుడూ అతడిని ఓడిపోవాలని చెప్పలేదన్నాడు. కొన్నేళ్ల క్రితమే తామిద్దరం విడిపోయామని వెల్లడించాడు. 'ఏ మ్యాచూ ఓడిపోవాలని నేనెతడికి చెప్పలేదు. బజరంగ్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు' అని పేర్కొన్నాడు.
బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌ను అరెస్టు చేయాలని బజరంగ్ పునియా మూడు నెలల నుంచీ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. శనివారం అతడు సోషల్ మీడియా వేదికగా మాట్లాడాడు. గతంలో ఉద్దేశపూర్వకంగా తనను మ్యాచులు ఓడిపోవాలని యోగేశ్వర్ దత్ చెప్పినట్టు అందులో వెల్లడించాడు. ఈ ఆరోపణలపై యోగి వివరణ ఇచ్చాడు.
'2016 ఒలింపిక్ క్వాలిఫికేషన్స్ ట్రయల్స్‌లో బజరంగ్ 65 కిలోల విభాగంలో ఉన్నాడు. మేమిద్దరం ఒకరితో ఒకరం తలపడలేదు. అతడిని అమిత్ ధన్‌కడ్ ఓడించాడు. ఫైనల్ పోరాటంలో నేను అమిత్‌తో తలపడ్డాను. ప్రొ రెజ్లింగ్ లీగ్‌లో మేమిద్దరం బరిలోకి దిగాం. అక్కడ నేను 3-0తో గెలిచాను. కావాలనుకుంటే నేను ఇంకా స్కోరు చేసేవాడిని. కానీ అది షో ఫైట్ అని అందరికీ తెలుసు' అని యోగి చెప్పాడు.
గతంలో విదేశాల్లో ట్రైనింగ్‌కు వెళ్లినప్పుడు బజరంగ్‌ను భాగస్వామిగా తీసుకెళ్లేవాడినని యోగి పేర్కొన్నాడు. '2016 ఒలింపిక్స్‌కు ముందు ఎప్పుడు విదేశాలకు వెళ్లిన బజరంగ్‌ను తీసుకెళ్లేవాడిని. ఇంత సాయం చేసినా అతడు నన్ను మోసం చేశాడు. అతడెందుకు ఇలా ఆరోపిస్తున్నాడో తెలియదు. అతడు నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. 2018లో బజరంగ్ నన్ను ఆసియా గేమ్స్‌కు వెళ్లమన్నాడు. అతడు కామన్‌వెల్త్‌కు వెళ్తానన్నాడు. కానీ నేను ట్రయల్స్‌కు వెళ్తానని చెప్పా. అప్పుడతడు నాపై కోప్పడ్డాడు. అప్పట్నుంచి మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు' అని యోగి వివరించాడు.
'2016 రియో ఒలింపిక్స్ తర్వాత నేనెలాంటి టోర్నీలోనూ ఆడలేదు. ఏ క్యాంపుకు వెళ్లలేదు. శిబిరాల్లో ఒకే విభాగంలో చాలామంది రెజ్లర్లు ఉంటారు. అందులో ఎవరు ఎవర్నైనా ఓడించొచ్చు. కానీ నేను అందులో లేను. రెజ్లింగ్ వదిలేశాను. నన్ను ఎవరైనా సులువగా ఓడించొచ్చు. 2018లో నేను ప్రొఫెషనల్ రెజ్లింగ్ వదిలేశాను. నేనిప్పుడు మాజీ కుస్తీవీరుడిని. మన మతంలో గోమాతను పవిత్రంగా పూజిస్తాం. నేనెప్పుడూ బజరంగ్‌ను ఓడిపోవాలని చెప్పలేదు. కావాలంటే గోమాతపై ప్రమాణం చేస్తా' అని యోగి వెల్లడించాడు.
ఏసియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ట్రయల్స్ నుంచి బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, సంగీత ఫొగాట్, సత్యవర్త్ కడియన్, జితేందర్‌కు మినహాయింపు కల్పిస్తూ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్యానెల్ తీసుకున్న నిర్ణయాన్ని యోగేశ్వర్ ప్రశ్నించాడు. ఈ నిర్ణయం వెనకాల లాజిక్‌ను ప్రశ్నించడమే కాకుండా జూనియర్లు, ఇతర రెజ్లర్లు ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడేలా చేశాడు. దాంతో బజరంగ్‌పై అతడిపై విమర్శలు చేయడం మొదలు పెట్టాడు. నిజానికి అతడే ట్రయల్స్ నుంచి మినహాయింపు పొందాడని, డబ్ల్యూఎఫ్‌ఐను అనుకూలంగా మార్చుకున్నాడని ఆరోపించాడు.
ఈ ఆరోపణలపై యోగి స్పందించాడు. '2014 టోర్నీకి ట్రయల్స్ లేకుండా ఎంపికయ్యానని అతడెందుకు నిందిస్తున్నాడు. అప్పట్లో ఫెడరేషన్‌కు అలాంటి మార్గదర్శకాలు ఉన్నాయి. కొన్నిసార్లు వారు మనం సాధించిన ఘనతలు, సీడింగ్‌ను బట్టి ట్రయల్స్ నుంచి మినహాయింపు ఇస్తారు. ప్రతి సమాఖ్యకు వేర్వేరు నిబంధనలు ఉంటాయి. వాటిని అందరూ గౌరవించాల్సిందే' అని అన్నాడు. మనిద్దరం 2018లోనే మాట్లాడటం మానేస్తే 2019లో తనను గురువు అని సోషల్ మీడియాలో ఎందుకు సంబోధించావని ప్రశ్నించాడు.