Wrestlers move Delhi High Court against WFI : ఈనెల 10, 11 తేదీల్లో భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India)నిర్వహించనున్న సెలక్షన్ ట్రయల్స్(Asian Championships and Olympic Qualifiers) ఆపాలంటూ స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా(Bajrang Punia) కోర్టును ఆశ్రయించాడు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనాలని తనకు అందిన ఆహ్వానాన్ని బజ్‌రంగ్ తిరస్కరించాడు. ఈ సెలక్షన్స్ ట్రయల్స్ ఆపాలంటూ ఢిల్లీ హైకోర్లు పునియా అత్యవసర పిటిషన్ వేశాడు. బజ్‌రంగ్‌తో పాటు వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, సత్యవర్త్ కడియన్ కూడా ఈ పిటిషన్లో భాగమైనట్లు తెలుస్తోంది. గత ఏడాది అప్పటి భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. WFI కొత్త అధ్యక్షుడు సంజయ్ సింగ్.. బ్రిజ్‌భూషణ్ సన్నిహితుడు కావడంతో సమాఖ్యలో తాము కోరుకున్న మార్పును ఆశించలేమని బజ్‌రంగ్ బృందం అంటోంది. డబ్ల్యూఎఫ్‌ఐపై ఐఓఏ నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో సమాఖ్య సెలక్షన్స్ ఎలా నిర్వహిస్తుందని బజ్‌రంగ్ ప్రశ్నించాడు. బజ్‌రంగ్ ప్రస్తుతం రష్యాలో శిక్షణ తీసుకుంటున్నాడు. WFI సెలక్షన్స్ ఆధారంగానే వచ్చే జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్‌కు జట్టును ఎంపిక చేయనున్నారు.
WFIపై సస్పెన్షన్ ఎత్తివేత
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)కి భారీ ఊరట లభించింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (United World Wrestling) కీలక నిర్ణయం తీసుకుంది. WFIపై నిషేధం ఎత్తివేత నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మంగళవారం (ఫిబ్రవరి 13న) రాత్రి ప్రకటించింది. అప్పటి డబ్ల్యూఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై మహిళా రెజ్లర్లు వేధింపులు, అత్యాచార ఆరోపణలతో ఆందోళన బాట పట్టడంతో నిర్ణీత గడువులోపు ఎన్నికలు నిర్వహించలేకపోయారు. దాంతో భారత రెజ్లింగ్ సమాఖ్యను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ గత ఏడాది సస్పెండ్ చేయడం తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐలో అంతర్గతంగా విభేదాలు, బ్రిజ్ భూషన్‌పై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన రెజ్లింగ్ నుంచే తప్పుకుంటూ రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే.
గతేడాది ఆగస్టులో WFI సస్పెన్షన్..
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) మరోసారి షాకిచ్చింది! గత ఏడాది ఆగస్టులో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సభ్యత్వాన్ని నిరవధికంగా సస్పెండ్ చేసింది వరల్డ్ రెజ్లింగ్. సరైన సమయంలో సమాఖ్యకు ఎన్నికలు నిర్వహించకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.
కొన్ని నెలలుగా భారత రెజ్లింగ్ సమాఖ్యను వేర్వేరు వివాదాలు వెంటాడుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం 2023 జూన్‌లోనే ఎన్నికలు జరగాల్సింది. కొందరు మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగడం, వారికి పురుష రెజ్లర్లు మద్దతు తెలపడం.. రాష్ట్ర సంఘాలు లీగలు పిటిషన్లు దాఖలు చేయడంతో వాయిదా పడ్డాయి. ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య భారత్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడం వల్ల రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెజ్లర్లు జాతీయ పతాకం కింద ఆడలేరు.