Wrestler Vinesh Phogat: గత కొన్ని రోజులుగా  బీజేపీ ఎంపీ, భారత  రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని  పోరాటం చేస్తున్న  రెజ్లర్లను  ముందుండి నడిపిస్తున్న  భారత అగ్రశ్రేణి  కుస్తీ యోధురాలు వినేశ్ ఫొగాట్‌కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) షాకిచ్చింది.   డోపింగ్  నిరోధక నిబంధనలు ఉల్లంఘించిందనే ఆరోపణతో  ఆమెకు నోటీసులు జారీ చేసినట్టు  సమాచారం. నోటీసులపై  ఆమె రెండు వారాల్లో వివరణ ఇవ్వాల్సిందిగా  తెలిపింది. 


‘ది ట్రిబ్యూన్’లో వచ్చిన కథనం మేరకు..  డోప్ కంట్రోల్ ఆఫీసర్  జూన్ 27న సోనిపట్‌లోని  ప్రతాప్ కాలనీకి వచ్చి అక్కడ సుమారు 40 నిమిషాలు వేచి చూశాడు.  వినేశ్ భర్తకు ఫోన్  చేయగా ఆయన కూడా అందుబాటులోకి రాలేదు. రెజ్లర్, వారి కుటుంబసభ్యుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో  దీనిని  నిబంధనల ఉల్లంఘన కిందికి చేర్చినట్టు  తెలుస్తున్నది. 


నాడా పరిధిలో ఉన్న అథ్లెట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి  డోపింగ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.  రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ) లో  పేరు నమోదుచేసుకున్న అథ్లెట్లు.. యాంటీ డోపింగ్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎడీఎఎంఎస్) లో తమ వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.  దీని ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి తాము ఎక్కడ ఉన్నది..? అన్న  విషయాలను సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. తాము ఎక్కడ ఉన్నామనేది చెబితే అధికారులే అక్కడికి వచ్చి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటారు. వినేశ్ ఆర్‌టీపీలో  డిసెంబర్ 2022 నుంచి ఉంటున్నారు.  






కాగా ఈ త్రైమాసికంలో  వినేశ్.. ఆర్‌టీపీ‌కి సమాచారం అందించినా తీరా సంబంధిత అధికారి అక్కడికి వెళ్లినా లేకపోవడంతో  నాడా ఆమెకు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాడా అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘వినేశ్ 14 రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలి.  12 నెలలలో  మూడు సార్లు ఇలా (శాంపిల్స్ సేకరణకు సహకరించకుంటే)  చేస్తే అది తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనల కిందకు వస్తుంది. ఒకవేళ అలా చేస్తే మాత్రం  రెండేండ్ల పాటు నిషేధానికి గురి కావాల్సి ఉంటుంది..’ అని వెల్లడించాడు. 


 


వినేశ్‌కు అందించిన నోటీసులో.. 14 రోజుల్లో తమకు  వివరణ ఇవ్వాలని కోరిన నాడా, నిబంధనలను ఉల్లంఘించినట్టు అంగీకరించాలని ఆమెను ఆదేశించింది.  ఒకవేళ అలాకాకుంటే లొకేషన్‌లో ఎందుకు అందుబాటులో లేరో వివరించాలి.. అని స్పష్టం చేసింది. ఇవి రెండూ చేయకుంటే వినేశ్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. 


లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కుంటున్న  బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరిలో  కొన్ని రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద  రెజ్లర్లు చేసిన ధర్నాను  వినేశ్ ముందుండి నడపించిన విషయం తెలిసిందే. పలుమార్లు బ్రిజ్ భూషణ్ కూడా.. వినేశ్  కుటుంబం తనపై పగబట్టి ఇలా చేస్తుందని ఆరోపించారు. ఇక తాజాగా వినేశ్‌కు నాడా  నోటీసులు పంపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం వినేశ్.. బుడాపెస్ట్ (హంగేరి)  ర్యాంకింగ్ సిరీస్ - 2023 పోటీలలో పాల్గొననుంది. ఈనెల 23 వరకూ ఇవి ముగుస్తాయి. అక్కడ్నుంచి వచ్చిన తర్వాత వినేశ్ ఈ నోటీసులకు సమాధానం ఇస్తుందా..? లేక అక్కడ్నుంచే మెయిల్ ద్వారా  రిప్లై ఇస్తుందా..? అన్నది  ఆసక్తికరంగా మారింది. 
































Join Us on Telegram: https://t.me/abpdesamofficial