Wrestler Bajrang Punia Reacts After Indefinite Suspension By Doping Body: డోపింగ్‌ పరీక్షకు నమూనా ఇవ్వడానికి నిరాకరించినట్లు నాడా చేసిన ఆరోపణలపై ప్రముఖ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా(Bajrang Punia) స్పందించాడు. డోప్‌ పరీక్షకు శాంపిళ్లను ఇవ్వడానికి తాను ఎప్పుడూ నిరాకరించలేదని స్పష్టం చేశాడు. గడువు తీరిన కిట్‌ తీసుకొచ్చి పరీక్షలు చేసేందుకు ప్రయత్నించిన విషయంపై తొలుత నాడా స్పందించాలని పూనియా డిమాండ్‌ చేశాడు. నాడా నిర్ణయంపై తన న్యాయవాది సమాధానం ఇస్తారని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. శాంపిల్‌ నిరాకరించడంపై బజరంగ్‌ పునియాకు నోటీసులు జారీ చేసిన నాడా...మే 7 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నిర్ణయంపై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా-WFI ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సమాచారం ఇవ్వకుండా పూనియాపై నిషేధం ఏలా విధిస్తారని ప్రశ్నించింది. ఈ అంశంపై వాడాకు లేఖ రాయనున్నట్లు WFI తెలిపింది.


వివరాల్లోకి వెళితే  .. 


మార్చిలో సోనిపట్‌లో జరిగిన ట్రయల్స్‌లో బజరంగ్ పునియా రోహిత్ కుమార్‌పై ఓడిపోయాడు. ఆ తర్వాత బజరంగ్ వెనువెంటనే  మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా నమూనాలను సేకరించేందుకు ప్రయత్నించింది.  అయితే బజరంగ్ యూరిన్ శాంపిల్ ఇవ్వడానికి నిరాకరించాడంట. ఆ తరువాత,  ఒక అథ్లెట్ తన నమూనా ఇవ్వలేదని NADA ప్రపంచ డోపింగ్ నిరోధక ఏజెన్సీ(WADA)కి తెలియజేసిందట. తరువాత కూడా వారి మధ్య పలు  చర్చలు జరిగాయి.  అసలు అతను పరీక్షకు ఎందుకు నిరాకరించాడో సమాధానం కోరుతూ  WADA నోటీసు జారీ చేయమని NADAని కోరింది.  అయితే ఆ నోటీసులకి కూడా అతను  సమాధానం ఇవ్వలేదు.


ఈ క్రమంలో ఏప్రిల్ 23న, నాడా మళ్లీ బజరంగ్ పునియాకు నోటీసు  పంపింది. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ మే 7 లోగా సమాధానం ఇవ్వవలసి ఉంటుందని పేర్కొంది.  బజరంగ్‌ పూనియాపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ  తాత్కాలిక నిషేధం విధించింది.  బజరంగ్ సమాధానం ఇవ్వని వరకు, అతనిపై  నిషేధం కొనసాగుతుంది. ప్రస్తుత  ఉన్న సమాచారం మేరకు పూనియా ఇకపై ఏ టోర్నీలో పాల్గొనలేడు.  పూనియా కేసు ఇప్పుడు  తక్షణం విచారించే అవకాశం ఉంది. కానీ విచారణ ఒక వేళ చాలా కాలం పాటు కొనసాగితే మాత్రం , అప్పుడు పూనియా ఒలింపిక్ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కూడా ఉండదు.


మూడోసారి ఒలింపిక్ బెర్తు సాధించిన వినేశ్‌ ఫొగాట్‌


భారత స్టార్‌ రెజ్లర్‌, రెండుసార్లు ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat)  వరుసగా మూడోసారి ఒలింపిక్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఆసియా ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో 50 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకోవడం ద్వారా వినేశ్‌  పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది.  సెమీఫైనల్లో లారా గనికీజీపై 10-0తో ఘన విజయం సాధించి  వినేశ్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే 53 కిలోల విభాగంలో అంతిమ్ పంగల్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో భారత మహిళ రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ నిలిచింది. 2016 రియో గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లోనూ పాల్గొన్న వినేశ్‌.. వరుసగా మూడోసారి ఒలింపిక్ బెర్తు సాధించింది.