Indian men and women enter knockouts: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌(world table tennis championships 2024)లో  భారత జట్లు ముందంజ వేశాయి. భారత పురుషుల, మహిళల జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధించాయి. గ్రూప్‌–1లోని చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–2తో స్పెయిన్‌పై గెలిచి 7 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఆకుల శ్రీజ, మనిక బత్రా కీలక సమయంలో రాణించడంతో భారత మహిళల జట్టు గ్రూప్‌-1 చివరి పోరులో 3-2తో స్పెయిన్‌ను ఓడించి నాకౌట్‌ చేరింది. తొలి రెండు సింగిల్స్‌లో ఓడిన శ్రీజ, మనిక.. రెండో సింగిల్స్‌లో గెలిచి భారత్‌కు విజయాన్ని అందించారు. మొదట శ్రీజ 9-11, 11-9, 11-13, 4-11తో మరియా చేతిలో, తర్వాత మనిక 11-13, 11-6, 11-8, 9-11, 7-11తో సోఫియా జాంగ్‌ చేతిలో తలొంచారు. కానీ ఐహిక ముఖర్జీ 11-8, 11-13, 11-8, 9-11, 11-4తో ఎల్విరా రాద్‌ను ఓడించి భారత్‌ను పోటీలోకి తెచ్చింది. ఆపై మనిక 11-9, 11-2, 11-4తో మరియాపై, శ్రీజ 11-6, 11-13, 11-6, 11-3తో సోఫియాపై నెగ్గి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో 4  మ్యాచ్‌ల్లో 3 విజయాలతో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. 

 

పురుషుల జట్టు కూడా..

ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌లో  పురుషుల జట్టు కూడా నాకౌట్‌ చేరింది. గ్రూప్‌-3 చివరి పోరులో భారత్‌ 3-0తో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. హర్మీత్‌ దేశాయ్‌ 11-5, 11-1, 11-6తో తిమోతిపై నెగ్గగా.. సత్యన్‌ 11-3, 11-7, 11-6తో అల్ఫ్రెడ్‌ డెలాపై, మనుష్‌ షా 6-11, 11-4, 11-8, 11-6తో హెండర్సన్‌పై గెలిచారు. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో మూడో స్థానంతో భారత్‌ ముందంజ వేసింది. క్వార్టర్స్‌ చేరితే భారత జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు దక్కించుకుంటాయి. అందుకు నాకౌట్లో రెండు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంది. గ్రూప్‌–3లోని చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–0తో న్యూజిలాండ్‌ను ఓడించి 6 పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. నేడు జరిగే నాకౌట్‌ దశ రెండో రౌండ్‌ పోటీల్లో ఇటలీతో భారత మహిళల జట్టు... కజకిస్తాన్‌తో భారత పురుషుల జట్టు తలపడతాయి. క్వార్టర్‌ ఫైనల్‌ చేరితే భారత జట్లకు పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు ఖరారవుతాయి. మొత్తం 40 జట్లు పోటీపడ్డ ఈ టోర్నీలో 24 టీమ్‌లు నాకౌట్‌ దశకు చేరుకున్నాయి. ఇక, క్వార్టర్‌ఫైనల్‌ చేరాలంటే మరో రెండు మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉంటుంది. క్వార్టర్స్‌కే చేరితే, పారిస్‌ ఒలింపిక్స్‌కు బెర్త్‌ ఖాయమవుతుంది. 

 

ఒలింపిక్‌ పతకాల్లో ఈఫిల్ టవర్‌

2024 ఒలంపిక్  పతకాల తుది రూపు బహిర్గతం అయ్యింది. ప్రఖ్యాత ఈఫిల్ టవర్( Eiffel Tower)  పునరుద్ధరణ పనలు సమయంలో తొలగించిన కొన్ని ఇనుప ముక్కలతో ఈసారి పతకాలను తయారు చేశారు. పతకం మధ్యలో ఇనుమును ఉంచి చుట్టూ బంగారం, రజతం, కాంస్య  తాపడాన్ని అద్దారు. పతకాలలో వాడిన లోహాలన్ని కొత్తగా గనుల్లో తవ్వి వెలికితీయలేదని ఒలంపిక్ క్రీడల నిర్వహకులు తెలిపారు. వాడిన లోహాలనే రీసైకిల్  చేసి పతకాలలో వినియోగించామని చెప్పారు. ఒలంపిక్స్ , పారాఒలంపిక్స్  క్రీడల కోసం నిర్వాహకులు మెుత్తం 5 వేల 84 పతకాలను తయారు చేయిస్తున్నారు. వాటిలో 2 వేల 600 పతకాలను ఒలంపిక్స్ క్రీడలకు, మరో 2 వేల 400 పతకాలను పారా ఒలంపిక్స్  క్రీడల విజేతలను ఇవ్వనున్నారు. అయితే అన్ని పతకాలను విజేతల కోసమే కాకుండా కొన్నింటిని మ్యూజియంలో ఉంచుతారు. మరికొన్నింటిని భద్రపరుస్తారు. ఎవరైనా క్రీడాకారులు డోపింగ్ కు పాల్పడి పతకం కోల్పోతే ఆ తర్వాతి స్థానంలో క్రీడాకారుడు లేదా క్రీడాకారిణికి ఆ భద్రపరిచిన పతకాన్ని ఇస్తారు. ఫ్రాన్స్  రాజధాని పారిస్ లో జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు 33వ ఒలంపిక్  క్రీడలు జరగనున్నాయి.