World Athletics introduces prize money for Olympic gold medallists: వరల్డ్‌ అథ్లెటిక్స్‌(World Athletics) సరికొత్త సంప్రదాయానికి  శ్రీకారం చుట్టింది. ఒలింపిక్స్‌(Olympic) అథ్లెటిక్స్‌(Athletes)లో స్వర్ణ పతకాలు సాధించే అథ్లెట్లకు నగదు ప్రోత్సహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పారిస్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో 48 విభాగాల్లో పసిడి పతకాలు గెలిచే వారికి ప్రైజ్‌మనీ అందివ్వనున్నట్లు తెలిపింది. 2024 ఒలింపిక్స్‌లో భాగంగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగాల్లో పోటీపడి స్వర్ణ పతకాలు గెలిచే క్రీడాకారులకు నగదు బహుమానం కింద 50 వేల యూఎస్‌ డాలర్లు భారత కరెన్సీలో రూ.41.60 లక్షలు అందించేందుకు సిద్ధమైంది. ఇలా నగదు బహుమానాన్ని ప్రకటించిన తొలి అంతర్జాతీయ క్రీడా సమాఖ్యగా డబ్ల్యూఏ(WA) నిలిచింది. 



ఒలింపిక్స్‌లో పాల్గొనే, పతకాలు గెలిచిన క్రీడాకారులకు పతకాలు తప్ప నగదు బహుమానం అందజేసిన దాఖలాలు ఇప్పటివరకూ లేవు. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. ప్రోత్సాహకాలు అందించేందుకు గాను 2.4 మిలియన్ల యూఎస్‌ డాలర్లను ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ వద్ద డిపాజిట్‌ చేసినట్టు తెలిపింది. 2028 లాస్‌ ఎంజేల్స్‌ ఒలింపిక్స్‌ నుంచి రజత, కాంస్య పతకాలు సాధించిన వారికి కూడా ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.


ఒలింపిక్‌ పతకాల్లో ఈఫిల్‌ టవర్‌
2024 ఒలంపిక్  పతకాల తుది రూపు బహిర్గతం అయ్యింది. ప్రఖ్యాత ఈఫిల్ టవర్( Eiffel Tower)  పునరుద్ధరణ పనలు సమయంలో తొలగించిన కొన్ని ఇనుప ముక్కలతో ఈసారి పతకాలను తయారు చేశారు. పతకం మధ్యలో ఇనుమును ఉంచి చుట్టూ బంగారం, రజతం, కాంస్య  తాపడాన్ని అద్దారు. పతకాలలో వాడిన లోహాలన్ని కొత్తగా గనుల్లో తవ్వి వెలికితీయలేదని ఒలంపిక్ క్రీడల నిర్వహకులు తెలిపారు. వాడిన లోహాలనే రీసైకిల్  చేసి పతకాలలో వినియోగించామని చెప్పారు. ఒలంపిక్స్ , పారాఒలంపిక్స్  క్రీడల కోసం నిర్వాహకులు మెుత్తం 5 వేల 84 పతకాలను తయారు చేయిస్తున్నారు. వాటిలో 2 వేల 600 పతకాలను ఒలంపిక్స్ క్రీడలకు, మరో 2 వేల 400 పతకాలను పారా ఒలంపిక్స్  క్రీడల విజేతలను ఇవ్వనున్నారు. అయితే అన్ని పతకాలను విజేతల కోసమే కాకుండా కొన్నింటిని మ్యూజియంలో ఉంచుతారు. మరికొన్నింటిని భద్రపరుస్తారు. ఎవరైనా క్రీడాకారులు డోపింగ్ కు పాల్పడి పతకం కోల్పోతే ఆ తర్వాతి స్థానంలో క్రీడాకారుడు లేదా క్రీడాకారిణికి ఆ భద్రపరిచిన పతకాన్ని ఇస్తారు. ఫ్రాన్స్  రాజధాని పారిస్ లో జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు 33వ ఒలంపిక్  క్రీడలు జరగనున్నాయి. 


పారిస్‌ ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి ఇప్పటికే  16 మంది షూటర్లు తమ బెర్తులను ఖాయం చేసుకున్నారు.  మిగతా క్వాలిఫయర్స్‌ పోటీల అనంతరం ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. భారత్‌ తరఫున అత్యధికంగా టోక్యో ఒలింపిక్స్‌లో 15 మంది షూటర్లు బరిలో దిగారు. జకార్తాలో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లోనే ఇషా సింగ్, వరుణ్‌ తోమర్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్ విభాగంలో బంగారు పతకాలు సాధించి పారిస్ ఒలింపిక్స్‌ బెర్తులను ఖరారు చేసుకున్నారు. 2021లో జపాన్‌ వేదికగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌.. 15 మంది షూటర్లతో బరిలోకి దిగగా తాజాగా ఆ సంఖ్య 16కు చేరింది.