వింబుల్డన్ అనగానే పచ్చని కోర్టుపైన తెల్లటి బట్టలు వేసుకుని కప్ కోసం పోటీ పడే ఆటగాళ్లే గుర్తుకొస్తారు. కానీ ఈసారి నుంచి ఆ సీన్‌లో మార్పు కనిపించనుంది. మహిళా ప్లేయర్ల పీరియడ్ సమస్యల కారణంగా కఠినమైన వైట్ డ్రస్ కోడ్‌ను తొలగించారు. దీంతో మహిళా ఆటగాళ్లు ముదురు రంగు అండర్ షార్ట్‌లు ధరించవచ్చు. కఠినమైన ఆల్-వైట్ డ్రెస్ కోడ్‌ను టెన్నిస్ క్రీడాకారులు బిల్లీ జీన్ కింగ్, డారియా సవిల్లే, మాజీ ఒలింపిక్ ఛాంపియన్ మోనికా ప్యూగ్ విమర్శించారు.


కింద భాగంలో ముదురు బట్టలు వేసుకోవడం కింగ్ మాట్లాడుతూ " ఇప్పుడు మీరు ఊపిరి పీల్చుకోగలరని అనిపిస్తుంది. మీరు కూర్చున్నప్పుడు, సైడ్స్ మారినప్పుడు ప్రతి నిమిషం చెక్ చేయవలసిన అవసరం లేదు." అన్నారు.


టోర్నమెంట్ నిర్వాహకులపై దుస్తుల కోడ్‌ను మార్చాలని, రుతుక్రమంలో ఉన్న ఆటగాళ్లకు తెల్లని దుస్తులపై రక్తం కనిపిస్తుందా లేదా అనే ఆందోళనను తగ్గించాలని ఎప్పటి నుంచో ఒత్తిడిని నెలకొంది. వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌లో ప్రచారకులు “About bloody time”, “Address the dress code” అని రాసి ఉన్న ప్లకార్డులతో ఆందోళన చేశారు.


ఆల్ ఇంగ్లండ్ క్లబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆటగాళ్లు, అనేక వాటాదారుల సమూహాల ప్రతినిధులతో సంప్రదించిన తర్వాత కమిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ కఠినమైన తెల్లని దుస్తుల నియమాన్ని మార్చాలని నిర్ణయించింది.


"వచ్చే సంవత్సరం నుంచి ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే మహిళలు, బాలికలు వారు ఎంచుకున్న రంగు అండర్‌షార్ట్‌లను ధరించే అవకాశం ఉంటుంది." అని బోల్టన్ అన్నారు. 2023-24 సీజన్ నుంచి జట్టు కిట్‌లో భాగంగా వైట్ షార్ట్‌లు కనిపించవని మాంచెస్టర్ సిటీ మేనేజర్ గారెత్ టేలర్ ప్రకటించారు.