Wimbledon 2024 Womens Single Winner : మహిళల వింబుల్డన్​ గ్రాండ్ స్లామ్ లో కొత్త విజేత ఆవిర్భవించింది. వింబుల్డన్ 2024 మహిళల సింగిల్స్‌ కొత్త ఛాంపియన్‌గా చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి బార్బర క్రెజికోవా అవతరించింది. శనివారం (జూలై 13న ) జరిగిన సింగిల్స్  ఫైనల్లో ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలినిపై 6-2, 2-6, 6-4 తేడాతో గెలుపొందింది.
ఈ ఇద్దరికీ ఇదే తొలి వింబుల్డన్‌ ఫైనల్‌. కానీ ఒత్తిడిని జయిస్తూ క్రెజికోవా విజయం సాధించింది. తాజా విజయంతో క్రెజికోవా ఖాతాలో రెండో గ్రాండ్‌స్లామ్‌ చేరింది. మూడేళ్ల కిందట 2021లో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా  క్రెజికోవా నిలవడం తెలిసిందే. 


తొలి సెట్​ ను 6-2తో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ క్రెజికోవా నెగ్గింది. రెండో సెట్​లో ఇటలీ భామ జాస్మిన్ నుంచి క్రేజికోవాకు గట్టి పోటి ఎదురైంది. 2-6 తో జాస్మిన్ రెండో సెట్ కొట్టింది. ఇక కీలకమైన మూడో సెట్​లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. కానీ గతంలో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన అనుభవంతో జాస్మిన్ పై క్రెజికోవా పైచేయి సాధిస్తూ సెట్  నెగ్గడంతో వింబుల్డన్ సింగిల్స్ ఛాంపియ‌న్‌గా చ‌రిత్ర సృష్టించింది. ఈ గ్రాండ్ స్లామ్ ట్రోఫీతో ఏకంగా రూ.28.5 కోట్ల ప్రైజ్‌మ‌నీని చెక్ రిపబ్లిక్ భామ క్రెజికోవా సొంతం చేసుకుంది.






గత 8 ఏళ్లుగా వింబుల్డన్ లో సరికొత్త విజేతలు అవతరిస్తున్నారు. చివరగా అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ నెగ్గింది.  2016లో సెరెనా నెగ్గిన తరువాత జరిగిన ప్రతి వింబుల్డన్‌లోనూ మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త ఛాంపియన్స్​ ఆవిర్భావిస్తున్నారు. ఈ ఏడాది సైతం తొలిసారి ఫైనల్ చేరిన ఇద్దరు తలపడటంతో కొత్త చాంపియన్ అవతరించింది.