వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సంచలనం నమోదైంది. అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా 6-4, 6-4తో ఆరో సీడ్ ఆన్స్ జబ్యూర్‌పై విజయం సాధించింది. అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువాకు ఇదే మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్. వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా నిలిచింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో మార్కెటా వోండ్రౌసువా ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటివరకు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అదే మార్కెటా వోండ్రౌసువాకు అత్యుత్తమ ప్రదర్శన.


హోరాహోరీగా సాగిన మొదటి సెట్‌లో మార్కెటా వోండ్రౌసువా 6-4తో విజయం సాధించింది. మొదటి రెండు పాయింట్లను ఆన్స్ జబ్యూర్ గెలుచుకుని 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మార్కెటా వెంటనే పుంజుకుని 2-2తో సమం చేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. 4-4తో ఈ సెట్ సమం అయింది. కానీ మార్కెటా వెంటనే రెండు పాయింట్లు గెలుచుకుని మొదటి సెట్ తన ఖాతాలో వేసుకుంది.


రెండో సెట్‌లో కూడా ఆన్స్ జబ్యూర్‌నే ముందంజ వేసింది. 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మార్కెటా వోండ్రౌసువా పుంజుకుంది. 4-4తో ఆధిక్యంలోకి రావడమే కాకుండా 6-4తో మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది. దీంతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది.