నోవాక్ జకోవిచ్ తన ఏడో వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం నిక్ కిర్గియోస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జకోవిచ్ 4-6, 6-3, 6-4, 7-6 (7/3)తో విజయం సాధించాడు. దీంతో పీట్ సంప్రాస్ ఏడు వింబుల్డన్ టైటిళ్ల మార్కును చేరుకున్నాడు. ఎనిమిది వింబుల్డన్ టైటిళ్ల రోజర్ ఫెదరర్ రికార్డుకు మరో టైటిల్ దూరంలో నిలిచాడు. దీంతోపాటు 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రఫెల్ నాదల్ రికార్డుకు మరో గ్రాండ్ స్లామ్ దూరంలో నిలిచాడు.


మొదటి సెట్‌ను 6-4తో గెలుచుకున్న నిక్ కిర్గియోస్ మరో రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలనుకున్నాడు. అయితే తన ఆశలపై జకోవిచ్ నీళ్లు చల్లాడు. తర్వాత వరుసగా మూడు సెట్లలో విజయం సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.


వీరిద్దరి మధ్య నాలుగో సెట్ హోరాహోరీగా సాగింది. టైబ్రేక్ దాకా సాగిన ఈ సెట్‌ను జకోవిచ్ 7-6 (7/3)తో గెలుచుకున్నాడు. దీంతో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నాడు. మొదటి గ్రాండ్ స్లామ్ గెలుచుకోవాలనుకున్న నిక్ కిర్గియోస్ వెయిటింగ్ ఇంకొన్నాళ్లు తప్పదు.