టీమిండియా యువ పేస్ సంచలనం జస్ప్రిత్ బుమ్రాకు ఇటీవల ప్రమోషన్ లభించింది. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న పేసర్ బుమ్రాను దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) బాధ్యతలు అప్పగించింది. ఇతర క్రికెటర్లను పక్కనపెట్టి మరీ పేసర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాళ్లను పక్కన పెట్టి బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఇవ్వడానికి గల కారణాలను ఎమ్మెస్కే ప్రసాద్ వివరించారు. ‘ఇది చాలా సులువైన నిర్ణయం. 2016లో జస్ప్రిత్ బుమ్రా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుంచీ అతడు నిలకడగా రాణిస్తూ ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. పలు సిరీస్‌లలో బౌలింగ్ విభాగానికి పెద్దగా వ్యవహరిస్తున్నాడు బుమ్రా. జట్టు కోసం శక్తి వంచన లేకుండా పోరాడుతున్న బుమ్రాకు తగిన గౌరవం ఇవ్వడం సరైన నిర్ణయం. పేసర్‌కు వైస్ కెప్టెన్సీ ఎందుకు ఇవ్వకూడదు.
ఒకవేళ రాహుల్ తప్పుకోవడం గానీ, సిరీస్‌కు దూరం కావడంగానీ జరిగినట్లయితే బుమ్రా తాత్కాలికంగా ఈ వన్డే సిరీస్‌లో కెప్టెన్సీ చేసే అవకాశం లేకపోలేదు. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్న బుమ్రా లాంటి పేస్ బౌలర్‌కు కెప్టెన్ గా సైతం అవకాశం ఇవ్వడంలో తప్పులేదు. జస్ప్రిత్ బుమ్రా ఏం ఆశిస్తున్నాడో ఎవరికీ తెలియదు. రాహుల్, రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే పేసర్‌కు సిరీస్ మొత్తం సారథ్య బాధ్యతలు అప్పగించడం సబబేనని’ ఎమ్మెస్కే ప్రసాద్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
మాజీ ఆల్ రౌండర్ రీతిందర్ సింగ్ సైతం బుమ్రాకు వెస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించే ఇలాంటి పేసర్ కెప్టెన్సీకి కూడా సరిపోతాడు. అయితే పేసర్లు కెప్టెన్సీ చేయలేరనే అపోహలు కూడా ఉన్నాయి. వీటిని పటాపంచలు చేయాలంటే ఇలాంటి కీలక నిర్ణయాలకు సైతం స్వాగతం పలకాల్సిన అవసరం ఉందన్నారు. టెస్ట్ సిరీస్ అనంతరం టీమిండియా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ మొదలవుతుంది.
Also Read: Sankranti Special Trains: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?